
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ఏర్పాటు, ముసాయిదా రూపకల్పనలో సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. మహాకూటమి ఏర్పాటై 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదన్నారు.
కానీ సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ లీకులు ఇస్తూ అన్ని పార్టీల్లో గందరగోళానికి కారణమవుతోందన్నారు. సీపీఐకి 3 లేదా 4 సీట్లు అంటూ అవమానకరంగా లీకులు ఇస్తూ సీపీఐ కార్యకర్తల్లో, పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న లీకులపై ఇప్పటికే కోదండరాం, రమణతో చర్చించినట్టుగా తెలిపారు. ఈ నెల 4న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. మహాకూటమిలో పొత్తులు, సీట్లు, కాంగ్రెస్ పార్టీ వైఖరి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment