
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పోటీ చేయాలనుకున్న స్థానాలన్నింటిలో గెలుస్తుందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. మహాకూటమిలో సీపీఐ కొనగడంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సుస్థిర అభివృద్ధి కోసం కూటమి ఉండాలన్నారు. తమ పార్టీ ఏ సీటు అడిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అంటుందని తెలిపారు. కాంగ్రెస్ పోటీ చేయాలనుకున్న అన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలుస్తుందా.. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రాసివ్వగలదా అని ప్రశ్నించారు. బాంచన్ దొర అని సీట్లు అడగటం ఇష్టంలేకే తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసినట్టు తెలిపారు.
తాను పోటీ చేసేది లేనిది తర్వాత ప్రకటిస్తాం: చాడ
మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము పోటీ చేయాలని భావిస్తున్న తొమ్మిది నియోజకవర్గాలను ప్రకటించిన చాడ.. మహాకూటమిలో కొనసాగే అంశంపై నేడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము ప్రకటించిన స్థానాల్లో ఐదు గౌరవప్రదమైన స్థానాలు కేటాయిస్తే కూటమిలో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కోరుకున్న నియోజకవర్గాలు కేటాయించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా.. లేదా అనే అంశాన్ని తర్వాత ప్రకటిస్తామని అన్నారు. హుస్నాబాద్ ప్రజలు మాత్రం తాను పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment