కాంగ్రెస్‌ లీకులపై సీపీఐ సీరియస్‌ | CPI Demands 9 Seats Include Kothagudem | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ లీకులపై సీపీఐ సీరియస్‌

Published Wed, Nov 7 2018 4:27 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

CPI Demands 9 Seats Include Kothagudem - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంపిణీపై భాగస్వామ్య పక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల విషయంలో కాంగ్రెస్‌ లీకులతో తాము తీవ్ర అసంతృప్తి చెందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది సీట్లు కావాలని తాము డిమాండ్‌ చేశామని.. సీపీఐకి ఎంతో కీలకమైన కొత్తగూడెం స్థానంపై తాము సీరియస్‌గా ఉన్నామని చాడ పేర్కొన్నారు. దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాధాన్యత గల సీట్లను ఇవ్వకపోతే కూటమిపై తాము పునరాలోచించుకుంటామని తేల్చిచెప్పారు. సీట్ల విషయంపై తమ పార్టీ శుక్రవారం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని చాడ ప్రకటించారు. కొత్తగూడెం సీటు​ ఇస్తామని ఒకసారి.. ఇవ్వమని మరోసారి కాంగ్రెస్‌ లీకులు ఇస్తోందని వాటిపై తాము తీవ్ర అసంతృప్తి చెందామని అన్నారు.

కాగా మహాకూటమిలో సీట్ల విషయంపై కాంగ్రెస్‌ నుంచి ఏలాంటి స్పందన లేదని.. బుధవారం టీజేఎస్‌ ఛైర్మన్‌ కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డిలు భేటీ అయిన విషయం తెలిసిందే. తమ భేటీలో సీట్ల విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని.. కేవలం స్నేహపూర్వకంగానే కలిసినట్లు చాడ వెల్లడించారు. మహాకూటమిలో సీట్లు ఏకాభిప్రాయానికి రాని పక్షంలో తాము ప్లాన్‌-బీని అమలు చేసి ఒంటరిగా పోటీ చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు ఇటీవల సీపీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement