సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించిన మూడు స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. హుస్నాబాద్ అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బెల్లంపల్లి- గుండ మల్లేష్, వైరా- బానోతు విజయబాయిలను ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి జాబితా విడుదల చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో సీపీఐకి మూడు సీట్లనే కేటాయించడం పట్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికి కేసీఆర్‌ను గద్దె దించడానికి తాము ఒప్పుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ మూడు సీట్లే ఫైనల్ అన్నారు. సీట్లకోసం ఇకపై కాంగ్రెస్‌ను కలిసేదిలేదని స్పష్టం చేశారు. నల్గొండలోని దేవరకొండ సీటు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. హుస్నాబాద్‌లో చాడపై రెబల్‌గా పోటీ చేస్తానంటున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి విషయాన్ని ఆ పార్టీ చూసుకోవాలన్నారు. రెబల్స్ ఉండకూడదనే తమకు కేటాయించిన మూడు సీట్ల నుంచి మాత్రమే బరిలోకి దిగుతున్నామని పల్లా తెలిపారు.
మొదట 12 సీట్లు కావాలని డిమాండ్ చేసిన సీపీఐ.. తర్వాత కనీసం 5 స్థానాలైనా కేటాయించాలని కోరింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మాత్రం 3 సీట్లనే ఇస్తామని తేల్చిచెప్పింది. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలంటే కూటమితో కలిసి పోటీ చేయడం అనివార్యంగా భావిస్తున్న సీపీఐ.. 3 సీట్లకు ఓకే చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment