
టీఆర్‌ఎస్ భవన్ వద్ద విజయోత్సవాలు..
గ్రేటర్‌లో కారు టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది..పాతబస్తీలో పతంగులు మళ్లీ రెపరెపలాడాయి..కమలం వాడి పోగా.. హస్తం అంతంత ప్రభావమే చూపింది.ముందస్తు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో సిటీజనం తీర్పు ఏకపక్షంగా ఉంది. 16 చోట్ల టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించగా, మజ్లిస్ పార్టీ పట్టు ఎక్కడా సడలలేదు. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సిట్టింగ్ అయిదు స్థానాల్లో కేవలం గోషామహల్‌లోనే ఆ పార్టీ అభ్యర్థి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లపై ఆశ పెట్టుకున్నా ఎల్‌బీనగర్, మహేశ్వరం స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి గ్రేటర్ నుంచి కొత్తగా ముగ్గురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మరో విశేషమేమిటంటే ఎంపీ మల్లారెడ్డి మేడ్చల్ నుంచి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ముంతాజ్ అహ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, తలసాని, దానం, అక్బరుద్దీన్, సాయన్నలు ఐదుసార్లు గెలిచారు.
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో కారు వేగానికి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ల కూటమి కుప్పకూలింది. బీజేపీ చతికిలపడింది. ‘అభివృద్ధి, సంక్షేమం, భద్రత’ నినాదంతో నగర ప్రజలను ఓట్లడిగిన టీఆర్‌ఎస్‌కు ఓటేసి ‘కేసీఆరే మా హీరో’ అని చాటిచెప్పారు. మంగళవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగర ప్రజలు ఏకపక్షంగా తీర్పునిస్తూ 14 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో విజయం కట్టబెట్టారు. ఎంఐఎం పాతబస్తీలో మళ్లీ 7 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఎల్బీనగర్, మహేశ్వరం, బీజేపీ ఒక్క గోషామహల్‌తో సరిపెట్టుకున్నాయి.
గోషామహల్ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్‌గౌడ్ మూడో స్థానంతోనే సరిపెట్టుకోగా, కంటోన్మెంట్ నుంచి పోటీచేసిన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఎల్బీనగర్‌లో సుధీర్‌రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి సొంత వ్యూహం, ప్రత్యర్థులపై భారీ వ్యతిరేకత వల్లే విజయం సాధించారు. ఇక ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్ స్థానాల్లోను దారుణంగా ఓడిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు సుహాసిని, ఆనంద్ ప్రసాద్‌లు కనీస పోటీ సైతం ఇవ్వలేకపోయారు. తెలంగాణ జనసమితి మల్కాజిగిరి, అంబర్‌పేటలలో డిపాజిట్లు కోల్పోయారు.
టాప్‌గేర్‌లో ‘కారు’ పరుగు
గత అసెంబ్లీ (2014) ఎన్నికల్లో కేవలం సికింద్రాబాద్, మల్కాజిగిరి, పటాన్‌చెరు స్థానాల్లో మాత్రమే గెలిచిన టీఆర్‌ఎస్.. ఈసారి నగరమంతా చుట్టేసింది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎంపీ మల్లారెడ్డి ఏకంగా 87,990 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించగా, సికింద్రాబాద్‌లో పద్మారావు, సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాసయాదవ్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్, అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్‌లో సాయన్న, మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, పటాన్‌చెరులో మహిపాల్‌రెడ్డి, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్‌లో ప్రకాష్‌గౌడ్, ఉప్పల్‌లో భేతి సుభాష్‌రెడ్డి విజయం సాధించారు.
పాతబస్తీలో ‘పతంగ్’ రెపరెపలు
చారిత్రక పాతబస్తీలో మళ్లీ ‘పతంగ్’ రివ్వున దూసుకుపోయింది. ఎంఐఎం అభ్యర్థులు తమతమ స్థానాల్లో మళ్లీ సునాయస విజయం సాధించించారు. చాంద్రాయణగుట్టలో పార్టీ ముఖ్య నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో విజయం సాధించగా, చార్మినార్, మలక్‌పేట, యాకుత్‌పురా, బహుదూర్‌పురా, కార్వాన్‌లను తిరిగి సొంతం చేసుకుంది. ఒక్క నాంపల్లి స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌తో గట్టిపోటీ ఎదుర్కొని చివరకు 9,675 మెజారిటీతో జాఫర్ హుస్సేన్ గెలుపొందారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పోటీ చేసినా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
చతికిలబడ్డ బీజేపీ..
ఎన్నికల ప్రచారాన్ని భారీ ఎత్తున హోరెత్తించిన బీజేపీ.. ఫలితాల్లో మాత్రం చతికిలబడింది. గోషామహల్‌లో 17,734 ఓట్ల మెజారిటీతో తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఒక్కరే విజయం సాధించగా, ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ 30,769 ఓట్లు పొంది మూడో స్థానంలో నిలిచారు. బీజేఎల్పీ నాయకుడిగా పనిచేసిన కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో చివరి వరకు పోరాడి కేవలం 1,016 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఖైరతాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 28,402 ఓట్ల తేడాతో ఓడిపోగా, మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రాజేంద్రనగర్‌లో బద్దం బాల్‌రెడ్డి వంటి ముఖ్యనేతలుఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు.
ఆ ముగ్గురు చివరి నిమిషం హీరోలు
నామినేషన్ల గడువుకు కొన్ని గంటల ముందు టికెట్లు దక్కించుకున్న ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్, అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్‌కు టికెట్లు ఇచ్చే అంశంపై చివరి వరకు తర్జనభర్జనలు జరిగాయి. నామినేషన్ల చివరిరోజు వారి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. అయినా ఆ ముగ్గురూ విజయం సాధించడం విశేషం.
పాతబస్తీపై మజ్లిస్ పట్టు
పాతబస్తీపై మజ్లిస్ తన పట్టు నిలుపుకుంది. సిట్టింగ్ స్థానాలను పదిలపర్చుకుంది. ఒక స్థానంలో మాత్రం గట్టి పోటీ కొనసాగడంతో ఫలితం దోబుచులాడింది. శివారులోని మరో స్థానంలో పాగ వేసేందుకు ప్రయత్నించినా టీఆర్‌ఎస్ చేతుల్లో పరాజయం పాలైంది. చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, కార్వాన్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, చార్మినార్, నాంపల్లి నియోజకవర్గాల్లో తిరిగి పాతవారే విజయం దుందుభి మేగించారు. ఎన్నికల బరిలో ఏడు స్థానాల్లో బీజేపీ, ఆరు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో టీడీపీ తలపడినప్పటికీ మజ్లిస్‌కు పోటీ ఇవ్వలేకపోయాయి. నాంపల్లి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ గట్టి పోటి ఇచ్చింది.
ఐదోసారి అక్బరుద్దీన్
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ నుంచి పార్టీ అగ్రనేత, సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి షాహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. అక్బరుద్దీన్ 95,339 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి 15,075 ఓట్లకు పరిమితమయ్యారు. గతం కంటే ఈసారి భారీగా మెజార్టీ వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే అక్బర్ తన హవా కొనసాగించారు.
నాలుగోసారి మౌజంఖాన్
బహదూర్‌పురాలో మజ్లిస్ అభ్యర్థి మహ్మద్ మౌజంఖాన్ వరసగా నాలుగోసారి విజయకేతనం ఎగురవేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీపై 82,518 ఓట్ల మెజార్టీ మౌజం గెలుపొందారు. మౌజంకు 96,993 ఓట్లు లభించగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి 14,475 ఓట్లకు పరిమితమయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఉనికి చాటుకున్నాయి.
ముంతాజ్ ఖాన్‌కు ‘డబుల్’ హ్యాట్రిక్
ఈ నియోజకవర్గం మజ్లిస్‌కు కంచుకోట. ఇక్కడ నుంచి మహ్మద్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. ఆయన ఇప్పటి దాకా యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు గెలుపొందగా.. ఈసారి చార్మినార్ నుంచి ఎన్నికల బరిలోకి దిగి 32,586 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఉమామహేందర్‌పై విజయం సాధించడమేగాక.. డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ముంతాజ్ ఖాన్‌కు 53,808 ఓట్లు లభించగా, బీజేపీకి 21,222 ఓట్లు, కాంగ్రెస్‌కు 16,899 ఓట్లు లభించాయి.
మలక్‌పేటలో బలాలా హ్యాట్రిక్
ఈ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా హ్యట్రిక్ సాధించారు. 12,506 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ముజఫర్‌పై గెలుపొందారు. బలాలాకు 32,020 ఓట్లు పోలవగా, ముజఫర్‌కు 19,514 ఓట్లు వచ్చాయి. ఆలె జితేంద్ర (బీజేపీ) 11,662 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
యాకుత్‌పురాలో పాషా..
ఈ సెగ్మెంట్ నుంచి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్)విజయం సాధించారు. ఇప్పటిదాకా చార్మినార్ నుంచి హ్యాట్రిక్ కొట్టిన ఖాద్రీ.. ఈసారి యాకుత్‌పురా నుంచి బరిలోకి దిగి టీఆర్‌ఎస్ అభ్యర్థి సామ సుందర్‌రెడ్డిపై 46,978 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు. ఖాద్రీకి 69,595 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి 22,617 ఓట్లతో రెండో స్థానంలోను, ఎంబీటీ అభ్యర్థి ఫర్హతుల్లా ఖాన్ 21,222 ఓట్లతో మూడో స్ధానంలో నిలిచారు.
కార్వాన్‌లో కౌసర్
కార్వాన్ నియోజకవర్గంలో వరుసగా మజ్లిస్ విజయ దుందుభి మోగించింది. ఇక్కడి నుంచి కౌసర్ మొయినుద్దీన్(మజ్లిస్) రెండోసారి ఎన్నికయ్యారు. 49,692 ఓట్ల అధిక్యతతో బీజేపీ అభ్యర్థి అమర్‌సింగ్‌పై గెలుపొందారు. కౌసర్‌కు 85,401 ఓట్లు రాగా, అమర్‌సింగ్‌కు 35,709 ఓట్లు పోలయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌కు మూడో స్థానం, కాంగ్రెస్ నాలుగో స్థానంలోను చిలిచింది.
నాంపల్లిలో మళ్లీ జాఫర్
ఈ నియోజకవర్గం నుంచి జాఫర్ హుస్సేన్ రెండోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ గట్టి పోటీ ఇవ్వడంతో చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. చివరకు మజ్లిస్ అభ్యర్థి జాఫర్ హుస్సేనే 9,675 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాఫర్‌కు 57,940, కాంగ్రెస్‌కు 48,265 ఓట్లు పోలయ్యాయి. ఇక టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు మూడు,నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు.
టాప్‌లో ఆ ఐదుగురు..
హిమాయత్‌నగర్: ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా టాప్–5 స్థానాల్లో టీఆర్‌ఎస్ నుంచి మల్లారెడ్డి, మజ్లిస్ నుంచి మహ్మద్ మోజాంఖాన్, అక్బరుద్దీన్ ఓవైసీ, మైనంపల్లి హన్మంతరావు, ప్రకాష్‌గౌడ్ నిలిచారు. అత్యల్పంగా కేవలం 376 ఓట్లతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందడం విశేషం.
అత్యధిక మెజార్టీ స్థానాలు ఇవే..
1. మేడ్చల్ అభ్యర్థి సీహెచ్ మల్లారెడ్డి (టీఆర్‌ఎస్)కి 1,65,324 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి కేఎల్‌ఆర్(కాంగ్రెస్)పై 87,990 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచారు.
2. బహుదూర్‌పురా నుంచి మహ్మద్ మోజాంఖాన్(మజ్లిస్)కి 96,993 ఓట్లు పోలవగా.. ప్రత్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీ(టీఆర్‌ఎస్)పై 82,580 ఓట్ల మెజారిటీతో సాధించి రెండో స్థానంలో నిలిచారు.
3. చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ(మజ్లిస్)కి 95,311 ఓట్లు పోలవగా.. ప్రత్యర్థి షహజాదీ(బీజేపీ)పై 80,263 ఓట్ల ఆధిక్యంతో గ్రేటర్‌లో 3వ స్థానం సొంతం చేసుకున్నారు.
4. మల్కాజగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు(టీఆర్‌ఎస్)కు 1,14,149 ఓట్లు నమోదవగా.. ప్రత్యర్థి ఎన్.రామచందర్‌రావు(బీజేపీ)పై 73,698 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.
5. రాజేంద్రనగర్ నుంచి టి.ప్రకాష్‌గౌడ్(టీఆర్‌ఎస్)కు 1,16,676 ఓట్లు పోలయ్యాయి. ఈయన ప్రత్యర్థి గణేష్‌గుప్తా(టీడీపీ)పై 57,331 ఓట్లతో విజయం సాధించి ఐదవ స్థానంలో నిలిచారు.
అత్యల్ప మెజార్టీ విజయాలు వీరివే..
1. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(టీఆర్‌ఎస్)కి 72,581 ఓట్లు నమోదు కాగా.. ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి(బీఎస్పీ)పై కేవలం 376 అత్యల్ప ఓట్లతో గెలుపొందారు.
2. అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్(టీఆర్‌ఎస్)కు 61,558 ఓట్లు పోలవగా.. ప్రత్యర్థి కిషన్‌రెడ్డి(బీజేపీ)పై 1,016 ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు.
3. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్)కి 94,631 ఓట్లు రాగా.. ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డి(టీఆర్‌ఎస్)పై 9,227 ఓట్లతో గెలుపొందారు.
4. నాంపల్లిలో జాఫర్ హుస్సేన్ మెరాజ్(మజ్లిస్)కు 57,940 ఓట్లు రాగా.. ప్రత్యర్థి మహ్మద్ ఫెరోజ్‌ఖాన్(కాంగ్రెస్)పై 9,675ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు.
5. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్(టీఆర్‌ఎస్)కు 67,213 ఓట్లు నమోదు కాగా.. ప్రత్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)పై 16,011 ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు.
గ్రేటర్‌లో ఆచూకీ లేని టీజేఎస్
సాక్షి,సిటీబ్యూరో: మహాకూటమిలో భాగంగా గ్రేటర్ పరిధిలోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసిన తెలంగాణ జనసమితి(టీజేఎస్) అభ్యర్థులు కనీసం రెండో స్థానంలోనూ నిలవలేకపోయారు. అంబర్‌పేటలో నిజ్జన రమేశ్, మల్కాజిగిరి నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ఓటమి పాలయ్యారు. రమేశ్‌కు కేవలం 4,261 ఓట్లు మాత్రమే లభించాయి. కూటమిలో భాగంగా చివరిదాకా ఎవరికి ఏ నియోజకవర్గం టికెట్ లభిస్తుందో తెలియకపోవడం, కూటమిలో ని భాగస్వామ్య పక్షాల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడం, టీజేఎస్ అభ్యర్థులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో టీజేఎస్ పోటీని తట్టుకోలేకపోయింది. దీనికితోడు పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు(టీఆర్‌ఎస్), రామచంద్రరావు(బీజేపీ).. అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి(బీజేపీ), కాలేరు వెంకటేశ్ (టీఆర్‌ఎస్) ముందు వీరి బలం ఏమూలకూ చాలలేదు. కూటమిలోని మిత్రపక్షాల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో టీజేఎస్ పోటీ నామమాత్రమైంది.
ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా మల్లారెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఎంపీగా ఉంటూ.. ఎమ్మెల్యేగా గెలిచి చామకూర మల్లారెడ్డి సరికొత్త రికార్డు నెలకొల్పారు. మల్కాజిగిరి ఎంపీగా కొనసాగుతున్న ఉన్న ఆయన తాజాగా మేడ్చల్ నియోకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి భారీ మెజారిటీతో విజయం దుందుభి మోగించారు. అయితే, ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఇక అంబర్‌పేట నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన కాలేరు వెంకటేష్ సతీమణి పద్మ గోల్నాక కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. నగరం నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్న వారిలో భేతి సుభాష్‌రెడ్డి(ఉప్పల్), ముఠా గోపాల్(ముషీరాబాద్), కాలేరు వెంకటేష్ (అంబర్‌పేట్) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment