సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఘోర పరాజ యం పాలవ్వడంపై రాష్ట్ర కార్యవర్గంతో అంతర్గత సమీక్ష, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 24న హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా పర్యటన ఖరారైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉనికిని చాటుకునేలా వ్యూహరచన చేసి రాష్ట్ర నాయకత్వానికి అమిత్‌షా దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో పొందిన సీట్లను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోవడంపై తెలంగాణ బీజేపీ నేతలపై షా తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీస ప్రభావం చూపించలేకపోవడంపై రాష్ట్ర నేతల పనితీరుపై షా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ వైఫల్యానికి కారణాలు గుర్తించి వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు షా తన పర్యటనలో మార్గదర్శనం చేయనున్నట్టు సమాచారం. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి ఉన్న లక్ష్యాలను వివరించి క్లస్టర్ల వారీగా విభజించిన లోక్‌సభ స్థానాలపై సమీక్షలు జరపనున్నట్లు తెలుస్తోం ది.రాష్ట్ర కార్యవర్గంలో పలు మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పర్యటన అనంతరం ఈ నెలాఖరున లేదా జనవరి తొలి వారంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది.
సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉంది..
తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విశ్లేషించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పోటీ చేయడం, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో పాల్గొనడంతో ఈ ఎన్నికలు తెలంగాణ వాదులు, వ్యతిరేకుల మధ్య పోటీగా మారిందని, దీని వల్ల ప్రజలు టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపారని అన్నారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు ప్రభావం, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఓటమిపాలయ్యామని ఆయన విశ్లేషించారు. పార్టీ వైఫల్యాలను గుర్తించి వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకొని సత్తాచాటుతామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment