కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడి చేసిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ హల్‌చల్ చేశారు. పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ కూడా విసిరారు.