దుశ్శాసనపర్వంపై ఆగ్రహ జ్వాలలు | political Parties supports to jerripothula victims | Sakshi
Sakshi News home page

దుశ్శాసనపర్వంపై ఆగ్రహ జ్వాలలు

Published Thu, Dec 21 2017 3:25 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

political Parties supports to jerripothula victims - Sakshi

సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : దళిత మహిళపై దుశ్శాసన పర్వానికి తెగబడ్డ టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, పలు పార్టీలు డిమాండ్‌ చేశాయి. టీడీపీ పాలనలో మహిళలకు, దళితులకు రక్షణ లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తాయి. మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో తాము ఉంటున్న భూమిని టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ గృహకల్ప పేరుతో ఆక్రమించుకోవడాన్ని ఓ దళిత మహిళ అడ్డుకోవడంతో వివస్త్రను చేసి 14 దళిత కుటుంబాలపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. గ్రామంలో పోలీసులను భారీగా మోహరించి 144 సెక్షన్‌ విధించారు. 

బాధితులకు పరామర్శ
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ మేరుగ నాగార్జున, విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్, నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్‌ప్రసాద్, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, కాంగ్రెస్‌ నేత, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌తో పాటు, సీపీఐ, సీపీఎం, ప్రగతిశీలా మహిళా సంఘం, ఐద్వా, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, పలు ప్రజా, దళిత సంఘాలు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దళితులపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేసి, జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు అప్పలనాయుడు భూదాహంతో దళితులు మానప్రాణాలకు ముప్పు వాటిల్లిందని ఆరోపించారు. దళిత మహిళపై అధికార పార్టీ దాష్టీకానికి నిరసనగా విశాఖ డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు ఒత్తిడితో పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం, కేసు వివరాలను వెల్లడించకపోవడంపై పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ మేరుగ నాగార్జున నేతృత్వంలో పార్టీ నాయకులు బుధవారం సాయంత్రం బైఠాయించి ఆందోళనకు దిగారు. 

పోలీసుల అదుపులో నిందితులు 
బాధితురాలు దుర్గమ్మ ఫిర్యాదు మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులు బుధవారం గ్రామంలో విచారణ నిర్వహించారు. అనంతరం నిందితులు పెందుర్తి వైస్‌ ఎంపీపీ మడక పార్వతి, టీడీపీ నాయకుడు మడక అప్పలరాజు, మడక రామునాయుడు, మాజీ సర్పంచ్‌ వడిశల శ్రీను, రాపర్తి గంగరాజు, సాలాపు జోగారావు, సాలాపు గంగమ్మలను వెస్ట్‌ జోన్‌ ఏసీపీ ఎల్‌.అర్జున్, సీఐ జె.మురళిలను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. దుర్గమ్మపై దాడికి పాల్పడ్డ ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీసీపీ–2 టి.రవికుమార్‌మూర్తి విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌లో విలేకరులకు తెలిపారు. మరోవైపు నిందితుల నుంచి కూడా అందిన ఫిర్యాదు మేరకు కౌంటర్‌ కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.  

ఎమ్మెల్యే బండారు కుమారుడు వచ్చాకే దాడి.. 
దళితులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డ సమయానికి కొద్ది నిమిషాల ముందు వరకు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కొడుకు అప్పలనాయుడు ఘటనాస్థలంలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. టీడీపీ నాయకులకు అప్పలనాయుడు ఏవో సూచనలు ఇచ్చి వెళ్లిన కొద్దిసేపటికే అతడి అనుచరులైన టీడీపీ నేతలు దళితులపై దాడికి దిగినట్లు బాధితులు తెలిపారు.

తొంగిచూడని ఎమ్మెల్యే..
దళిత మహిళపై టీడీపీ శ్రేణుల దౌర్జన్యం ఘటనను ఎమ్మెల్యే బండారు తన అధికార బలంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పలువురు నేతలు బాధితులకు బాసటగా నిలిచినా ఎమ్మెల్యే బండారు అటువైపు తొంగి కూడా చూడలేదు. మరోవైపు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న మరో గ్రామంలో ఎమ్మెల్యే నిశ్చింతగా ఇంటింటి టీడీపీ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement