హామీల అమలెప్పుడు ‘నెల’రాజా! | Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

హామీల అమలెప్పుడు ‘నెల’రాజా!

Published Sun, Jul 14 2024 12:22 AM | Last Updated on Sun, Jul 14 2024 1:06 PM

Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali

జనతంత్రం

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అనే విషయం చంద్రబాబుకూ, ఆయన కొలువు కూటమికీ స్పష్టంగా తెలుసు. మొన్నటి ఎన్నికల ఫలితాలను ఎంత శాతం మేరకు ట్యాంపరింగ్‌ చేశారన్న రహస్యం కూడా వారికి మాత్రమే తెలుసు. అలవికాని హామీలతో తాము ఓటర్ల చెవుల్లో పెట్టిన పొద్దుతిరుగుడు పువ్వులు తమ వైపే తిరిగి ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఆ దృష్టిని మళ్లించాలి. జనంలో జగన్‌కున్న ప్రతిష్ఠను తగ్గించాలి. ఇది వారి తక్షణ కర్తవ్యం.

మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు దాటింది. చేసిన వాగ్దానాల అమలు సంగతి దేవుడెరుగు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఫలానా తేదీల వారీగా అమలు చేయబోతున్నామనే షెడ్యూల్‌కు కూడా జనం నోచుకోలేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే సంతకం చేసిన ‘మెగా డీఎస్సీ’ ఫైలుతో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. అందుతున్న సూచనలను బట్టి ఈ సంవత్సరాంతానికి కూడా ఆ పరీక్షలు పూర్తయ్యే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నాటికి పదవీ విరమణ చేయబోయే వారిని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికల్లా డీఎస్సీ నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఈ విద్యా సంవత్సరానికే భర్తీ అయ్యే విధంగా జగన్‌ ప్రభుత్వం 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీని చాపచుట్టేసి, వచ్చే సంవత్సరం ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలిపి దానికి ‘మెగా డీఎస్సీ’ అనే ముద్ర వేసి వచ్చే సంవత్సరమే భర్తీ చేయబోతున్నారన్నమాట. ఈ సంవత్సరమే కొలువుల్లో చేరవలసిన 6,100 మంది ఉపాధ్యాయ ఔత్సాహికుల నోళ్లల్లో ఆ విధంగా మట్టికొట్టారు. సర్కార్‌వారి తొలి అడుగే చీటింగ్‌!

పెంచిన పెన్షన్లను తొలి మాసం నుంచే ఇస్తున్నట్టు భారీ ఆర్భాటం చేశారు. అంతకు ముందు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల చేతిలో పెన్షన్‌ డబ్బులు పెట్టి వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. కానీ ఆచరణ అందుకు విరుద్ధంగా జరిగింది. చాలామందిని గ్రామ సచివాలయాలకు పిలిపించి క్యూలైన్లో కూర్చోబెట్టుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక తెలుగుదేశం నాయకుల ఇళ్లల్లోనే కార్యక్రమాన్ని జరిపించారు. ప్రతిచోటా మెడలో పార్టీ జెండాలు కప్పుకొని హడావిడి చేశారు. కొన్నిచోట్ల జనసేన జెండాలకూ, తెలుగుదేశం జెండాలకూ మధ్య క్రెడిట్‌ వార్‌ జరిగింది.

పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం గడిచిన ఐదేళ్లూ ఎలా జరిగింది? ఎప్పుడైనా రాజకీయ జోక్యం మాట విన్నామా? ఎక్కడైనా జెండాలు, కండువాలు కనిపించాయా? కుల మత రాజకీయ వర్గ లింగ భేదం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకటో తేదీ సూర్యోదయం వేళకే ప్రతి ఇంటి గుమ్మానికీ వలంటీర్లు చేరుకొని పెన్షన్‌ సొమ్ములు అందజేశారు. ఎక్కడా రాజకీయం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే జరిగింది. లబ్ధిదారుల ఎంపికలోగానీ, పెన్షన్ల పంపిణీలో గానీ వైసీపీ కార్యకర్తలు జోక్యం చేసుకోలేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే కదా! ప్రభుత్వాలు పని చేయవలసిన తీరు  ఇదే కదా!

కొత్త సర్కారు వారి తొలి మాసం నిర్వాకంలోనే రాజకీయం గజ్జెలు కట్టుకొని దూకింది. తమ పార్టీ వారు కాదన్న కారణంతో చాలాచోట్ల పంపిణీ చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ధోరణి ఇంకెంతదూరం వెళ్తుందో రానున్న రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది. పోనీ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్‌ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేశారా? బీసీలకు,  ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు యాభయ్యేళ్లకు పెన్షన్‌ వర్తింపజేస్తామన్నారు! మొదటి నెలలోనే ఇవ్వడం కుదరకపోవచ్చు. కనీసం ఏ నెలలో, ఏ సంవత్సరంలో అమలు చేస్తారన్న ప్రకటనైనా రావాలి కదా! ఆ ముహూర్తం కోసం లక్షలాదిమంది ఎదురు చూస్తున్నారు.



‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో తెలుగుదేశం పార్టీ ఆరు మాసాలపాటు ఊదరగొట్టిన ఆరు హామీలనైనా వెంటనే అమలు చేయడం ప్రారంభించి ఉంటే... మిగిలిన మేనిఫెస్టోపై జనం నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండేది. కనీసం వాటికి సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఈ నెల రోజుల్లో విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 20 లక్షల ఉద్యోగాలన్నారు, షెడ్యూల్‌ ప్లీజ్‌! నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయల నెలసరి భృతి అన్నారు. ఎప్పటి నుంచి? కనీసం ఒక ప్రకటన వచ్చినా వారికి కొంత ఊరట లభిస్తుంది.

ప్రతి బిడ్డా తప్పనిసరిగా బడికి వెళ్లాలనీ, మంచి చదువు అభ్యసించాలన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మ ఒడి’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. పిల్లల్ని బడికి పంపే విధంగా ప్రోత్సహించడం కోసం బడి వయసు పిల్లలున్న ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. ‘ఒక్క పదిహేను వేలే ఇవ్వడం ఏమిటి, మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎందరు పిల్లలుంటే అన్ని పదిహేను వేలు ఇస్తామ’ని కూటమి టముకు వేసింది. ‘సూపర్‌ సిక్స్‌’లో రెండో కార్యక్రమంగా దాన్ని నమోదు చేసింది. సుమారు కోటిమంది పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు.పసిపిల్లల్ని ఆశపెట్టి మోసగించడం మహాపాపం. తేదీలు త్వరగా ప్రకటించండి. పుణ్యకాలం గడిచిపోతున్నది.

వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరుతో రైతుకు పెట్టుబడి ఖర్చును అందజేసేది. ఈ సాయాన్ని తాము 20 వేల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో మూడో సిక్సర్‌ కొట్టారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. అప్పుడే మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు నడుస్తున్నది. సర్కారు సాయం చినుకులు ఎప్పుడు రాలుతాయో చెప్పే నాథుడు కనిపించడం లేదు. పందొమ్మిదో యేడు నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ప్రతి మహిళకూ నెలకు పదిహేను వందలు అందజేస్తామని ‘సూపర్‌ సిక్స్‌’లో పేర్కొన్నారు.

ఈ వయసులో ఉన్న మహిళల సంఖ్య సుమారు ఒక కోటీ ఎనభై లక్షలని అంచనా. వచ్చే నెల శ్రావణమాసం. శుభ దినాలు. ఆడపడుచులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇంకెప్పుడు చెబుతారని అడుగుతున్నారు. ఉచితంగా ఇచ్చే మూడు సిలిండర్లను ఏయే నెలల్లో ఇవ్వబోతున్నారో తెలుసుకోగోరుతున్నారు. ఈ నిరీక్షణంతా కూటమి వాగ్ధానాల్లో పెద్దపీట వేసిన ‘సూపర్‌ సిక్స్‌’ గురించే! చేంతాడు పొడవు మేనిఫెస్టో గురించిన ప్రస్తావన ఇంకా మిగిలే ఉంది.

ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లను ఆమోదించుకున్నాయి. ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటనకు ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే వాటికి అవసరమైన కేటాయింపులను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించాలి. అటువంటి ప్రతిపాదనలకు చోటు దక్కనట్టయితే మేనిఫెస్టో అమలు అటకెక్కినట్టే! మరో ఏడాదిపాటు మాట్లాడే అవకాశం ఉండదు. ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు, పెంచిన పెన్షన్ల అమలుకు మాత్రమే అదనంగా ఏటా లక్ష కోట్లకు పైగా నిధుల అవసరం ఉన్నదని ఒక అంచనా.

గతంలో అమలులో ఉన్న పథకాలను యథావిధిగా అమలు చేస్తూనే (పెన్షన్లు, అమ్మ ఒడి మినహా) అదనంగా లక్ష కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంత సొమ్మును అదనంగా ఎలా సమీకరించబోతున్నారో తేలవలసి ఉన్నది. వారి మాటల్లోనే చెప్పాలంటే, అడ్డగోలుగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకకు అమ్మమ్మగా మారుస్తారో, అమల్లో ఉన్న పథకాలకు అంటకత్తెర వేసి ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారో పూర్తిస్థాయి బడ్జెట్‌లో తేలిపోతుంది. చంద్రబాబు ‘సంపద సృష్టి’ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడవుతుందో తెలియదు! అమరావతి నిర్మాణంతో సంపద సృష్టించడం అంటే మెజీషియన్‌ టోపీలోంచి పిల్లిని బయటకు తీయడం లాంటిదేనని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

ఈ నేపథ్యంలో మేనిఫెస్టో హామీలు, సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాల నుంచి జనం దృష్టిని మళ్లించే రాజకీయ టక్కుటమారాలే చంద్రబాబు సర్కార్‌ ముందున్న ప్రత్యామ్నాయమన్న అభిప్రాయం బలపడుతున్నది. అందువల్లనే ‘రెడ్‌ బుక్‌’ ఎజెండాగానే గడిచిన నెలరోజుల పరిపాలన జరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై వెయ్యికి పైగా దాడులు, విధ్వంసాలు ఈ స్వల్పకాలంలో జరిగాయి. అనేకమందిపై కేసులు పెట్టారు. మేనిఫెస్టో అమలు గురించి అడిగే సాహసం ఎవరూ చేయకూడదు. అందుకోసమని రెడ్‌బుక్‌ టెర్రర్‌ను అమలుచేస్తున్నారు. 

సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముద్దాయిగా చేరుస్తూ ఒక దిక్కుమాలిన కేసును కూడా నమోదు చేశారు. మూడేళ్ల కింద సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రిని, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను, ఒక ప్రభుత్వ డాక్టర్‌ను ముద్దాయిలుగా చేర్చడం ఎంత తెంపరితనమో అర్థం చేసుకోవచ్చు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిపైనే కేసు పెడితే ప్రశ్నించే గొంతులు వణికిపోతాయని సర్కార్‌ పెద్దలు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. మేనిఫెస్టో హామీలు, ‘సూపర్‌ సిక్స్‌’ వాగ్దానాలు బడ్జెట్‌ పరీక్షను పాస్‌ కావలసిందే! లేకపోతే నిలదీసే గళాలు వేలల్లో, లక్షల్లో ఉండవు. కోట్ల గొంతుకలు విచ్చుకుంటాయి. 


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement