అరణ్యానికి ఆసరా | Sakshi Editorial On Forest lands and tribals | Sakshi
Sakshi News home page

అరణ్యానికి ఆసరా

Published Fri, Feb 23 2024 12:23 AM | Last Updated on Fri, Feb 23 2024 12:23 AM

Sakshi Editorial On Forest lands and tribals

అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్‌ పర్యావరణవేత్త చికో మెండిస్‌ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు.

దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు.

వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది.

ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్‌ గోదావర్మన్‌ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. 

అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి.

ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్‌ కోసం, థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి.

వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్‌ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్‌లతోపాటు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్‌ జేఎస్‌ వర్మ, జస్టిస్‌ బీఎన్‌ కృపాల్‌ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది.

దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. 

పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్‌ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్‌ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement