సాక్షి, అమరావతి: గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు, అడవుల్లో సేకరించే ఫల సాయాలకు ఇకపై విలువ పెరగనుంది. ఇప్పటివరకు గిరిజనులు వీటిని నేరుగా వ్యాపారులకు అమ్ముతున్నారు. వారికి సరైన ధర లభించడంలేదు. ఈ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విక్రయించడం ద్వారా వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం.. ఈ లాభాలు గిరిజనులకే దక్కేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన పంటలను ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ చేయించడం ద్వారా మంచి ధరలకు అమ్మే వీలుంది.
ఆ కార్యక్రమానికి గిరిజన స్వయం సహాయక సంఘాల (స్త్రీలు, పురుషులు) ద్వారా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సంఘాలతో వన్‌ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) ఆర్థికసాయం అందిస్తున్న ఈ కార్యక్రమం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే మొదలైంది. విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 50 వన్‌ధన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 750 గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 15 వేలమంది సభ్యులున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీఏలో ఒక వన్‌ధన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్లో ఉన్న 15 గ్రూపుల్లో 300 మంది సభ్యులున్నారు.
మరో 46 వన్‌ధన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విశాఖ జిల్లా పాడేరు, పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏల పరిధిలో మరో 46 వన్‌ధన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటిలో 690 గ్రూపులతో 12,605 మంది సభ్యులుంటారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.4.50 కోట్లతో.. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులకు విలువ జోడించడం ఎలా అనే అంశంపై 15 వేలమందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి కాగానే ఒక్కో గ్రూపు రూ.15 లక్షల విలువైన ప్రాసెసింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రధానంగా అడవుల్లో సేకరించిన చింతపండును విత్తనాలు తీసి ప్రాసెసింగ్ చేయడం ద్వారా విలువ జోడించవచ్చు. ప్రస్తుతం విత్తనాలతో గిరిజనులు అమ్మే చింతపండు కిలో రూ.35కు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) కొనుగోలు చేస్తోంది. అదే ప్రాసెస్ చేసిన తరువాత దాని ఖరీదు కిలో రూ.65కు పైన ఉంటుంది. రిటైల్ మార్కెట్లో కిలో చింతపండు ధర రూ.200 వరకు ఉంది. ఇలా ప్రతి ఉత్పత్తికి విలువ జోడించే విధంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని తద్వారా వచ్చిన ఆదాయాన్ని గిరిజనులే తీసుకుంటారు. వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుండగా మానవ వనరులను రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ ద్వారా సమకూరుస్తోంది.
గిరిజన ఉత్పత్తులకు పెరగనున్న విలువ
Published Mon, Mar 1 2021 5:00 AM | Last Updated on Mon, Mar 1 2021 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment