పూసుకుంటలో గిరిజన మహిళలతో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రాష్ట్రంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా 9.34% ఉంది. కానీ పలు ప్రాంతాల్లో వారి ఆరోగ్యం, జీవనస్థితిగతులపై నాకు ఆందోళన కలుగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని ఆయా తెగల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక చర్య లు తీసుకుంటా’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు.
రెండు రోజుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం దమ్మపేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మండలం గోగులపూడి, రెడ్డిగూడెంలో గవర్నర్ పర్యటించారు. కొండరెడ్లతో ముఖా ముఖి నిర్వహించారు. అనంతరం అశ్వాపురం మండలంలోని మణుగూరు భారజల కర్మాగారాన్ని సందర్శించారు. తర్వాత కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి గవర్నర్ విలేకరులతో మాట్లాడారు.
దమ్మపేట మండలం పూసుకుంటలో కొండరెడ్లను పలకరించానన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి సౌజన్యంతో అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించగా ఒకరికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలిందన్నారు. ఆ వ్యక్తికి హైదరాబాద్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తామన్నారు. అలాగే 100 మంది గర్భిణులకు స్కానింగ్ నిర్వహిస్తే 48 మంది హైబీపీతో, 27 మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. బ్రెస్ట్ కేన్సర్‌తో ఒకరు, సర్వైకల్ కేన్సర్‌తో ఒకరు బాధపడుతున్నారని చెప్పారు.
రూ. 44.32 లక్షలు మంజూరు...
‘గిరిజనులు పీచు పదార్థాలు తినకపోవడం వల్లే వారిలో ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. అందుకే ఇప్పపువ్వుతో చేసిన మహువా లడ్డూలు పెడుతున్నాం. తద్వారా చిన్నారుల్లో పోషకలోపాన్ని అధిగమించి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అలాగే ఆ ప్రాంత అభివృద్ధికి మేం రూ. 44.32 లక్షలు మంజూరు చేశాం. మహిళల కోసం హైజీనిక్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. గిరిజన మార్గాల్లో అత్యవసర పరిస్థితుల్లో సాధారణ అంబులెన్సులు, వాహనాలు ప్రయాణించలేనందున రెండు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశాం’అని గవర్నర్ తెలిపారు.
మీరంటే ఎంతో ప్రేమ...
‘మీపై (ఆదివాసీలపై) ఎంతో ప్రేమ ఉంది. ఆ ఆసక్తి, అభిరుచితో మీ కోసం పోషకాహార లోప నివారణకు పైలట్ ప్రాజెక్టు చేపట్టా. మీరంతా సంపూర్ణ ఆరోగ్యంగా, మంచి చదువు, జీవనోపాధితో జీవించాలని కోరుకుంటున్నా’అని కొండరెడ్డి గిరిజనులతో భేటీలో గవర్నర్ తమిళిసై చెప్పారు. అంతకుముందు తమిళిసైకి గిరిజన మహిళలు రేల నృత్యాలు, చిల్ల కాయల సవ్వడులు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తమిళిసై సరదాగా డప్పులు వాయిస్తూ వారితో కలసి నృత్యం చేశారు. ఆపై కొండరెడ్లతో కలసి సహపంక్తి భోజనం చేయడంతోపాటు వారికి స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ అజయ్ మిశ్రా, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment