పట్టుచెన్నేరు సమీపంలో కోనదొర కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించిన ఒడిశా రాష్ట్ర నాయకులు
సాలూరు: పరిషత్ ఎన్నికల్లో కొటియా గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తిని సాకుగా చూపుతూ కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఎమ్.అక్తర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు బుధవారం ప్రత్యేక బలగాలతో కొటియా గ్రామాలకు చేరుకున్నారు. గిరిజన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పట్టుచెన్నేరులో రహదారులపై రాళ్లు అడ్డంగా వేసి దారిని దిగ్బంధించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానానికి నేరెళ్లవలస సంత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. పోలింగ్ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా అడ్డుకోవడంతో సీఐ అప్పలనాయుడు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌వో మధుసూదనరావు నేరెళ్లవలస చేరుకున్నారు. ఒడిశా బలగాలు వారికి 144 సెక్షన్ ప్రతిని చూపించాయి. దీనిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పోలింగ్ స్టేషన్‌లో వివాదం
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కౌశల్యాపురం పోలింగ్ స్టేషన్‌లో ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా అధికారులు బుధవారం పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చి భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ ఆంధ్రా అధికారులకు చెప్పారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు చర్చించారు. అనంతరం అధికారులు దీనిపై పాలకొండ ఆర్డీవో, సీతంపేట ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేశారు. వెంటనే పీవో.. కౌశల్యాపురం పాఠశాల వద్దకు చేరుకుని ఇరు రాష్ట్రాల అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఒడిశా అధికారులతో పీవో మాట్లాడి గురువారం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment