సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో గెలిచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. మూడు విడతల్లో సాగుతున్న పరిషత్ ఎన్నికలు ఈనెల 14న ముగుస్తుండగా, ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, 27న నిర్వహించే ఓట్ల లెక్కింపు అనంతరం పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాత సభ్యులకు ఓటింగ్ అవకాశం ఇవ్వకుండా కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆ హక్కును కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కూడా కలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు టీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతూ కొత్తగా ఎన్నికవుతున్న పరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల్లో కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై మొదటివారంలోనే మొదలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో కొత్త సభ్యులు ఓటు వేసే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు.
అదీగాకుండా ఈ స్థానాలకు జరుగుతున్న వి ఉప ఎన్నికలు కాబట్టి, పాత సభ్యులే ఓటేసేం దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. అంతకు ముందే కొండా మురళీధర్‌రావు కూడా తన ఎమ్మెల్సీ సీటును వదులుకున్నారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామాలిచ్చిన 6 నెలల్లోగా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండడంతో ఇటీవల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment