సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన వెంటనే జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ), మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతమున్న నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) తెలిపింది. ఈ నిబంధనలు సవరించడం ద్వారా పరిషత్ ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ ఆలస్యం లేకుండా ఎన్నికైన సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకునే వీలుంటుందని ఎస్‌ఈసీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన అందగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు తేదీని ఎస్‌ఈసీ ప్రకటిస్తుందన్నారు. సోమవారం జరగాల్సిన పరిషత్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన నేపథ్యంలో మళ్లీ కౌంటింగ్ నిర్వహించే తేదీని ఎస్‌ఈసీ ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment