సాక్షి, హైదరాబాద్: మూడో విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 14న మూడో విడత పోలింగ్ నేపథ్యంలో మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంక ర్ భూపాలపల్లి జిల్లాల్లో మాత్రం ఆదివారం సాయం త్రం 4 గంటలకు ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన పరిషత్ మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు ప్రచారం పూర్తి చేయాలని పేర్కొంది. 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానా ల్లో ఎన్నికలు జరగనున్నాయి. ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించారు. పార్టీ జెండాలు, బ్యానర్లు ఇంకా ఉంటే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ పేర్కొంది.
టీవీలు, రేడియోల్లో ప్రచారాన్ని ఆపేశా రు. మూడో విడత పోలింగ్ ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికల గుర్తులను ప్రసారం చేయరాదని, బహిరంగంగా గుర్తులతో తిరగరాదని ఎస్‌ఈసీ తెలిపింది. గ్రామాలు, ప్రాదేశిక నియోజకవర్గాలు, మండలాల వారీగా పరిశీలకులు, వ్యయ పరిశీలకులు తిరుగుతున్నారు. ఇక ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులైన నేతలు రెండో విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఉండరాదని ఎస్‌ఈసీ ఆదేశించింది. అలాంటి వారు ఉంటే కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఇప్పటికే తొలి, రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు ముగిశాయి. అన్ని విడతల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి.
రూ. 3.22 లక్షల నగదు స్వాధీనం
పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోరు కోసం ఓటర్లను మభ్య పెట్టేందుకు తరలిస్తున్న నగదు, మద్యాన్ని పట్టుకున్నారు. వరంగల్, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, గద్వాల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.3,22,140 నగదు, రూ.9.45 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. పరిషత్ ఎన్నికల్లో ఇప్పటివరకు మొత్తం రూ.87,11,290 నగదును స్వాధీనం చేసుకోగా.. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రూ.64 లక్షలు పట్టుకున్నారు. ఇక 280 మందిపై కేసు నమోదు చేసి, 233 మందిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment