నేడు రెండో విడత పరిషత్‌ పోలింగ్‌ | Council for the Second Phase of Polling Today | Sakshi
Sakshi News home page

నేడు రెండో విడత పరిషత్‌ పోలింగ్‌

Published Fri, May 10 2019 5:43 AM | Last Updated on Fri, May 10 2019 5:43 AM

Council for the Second Phase of Polling Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత పరిషత్‌ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల్లో 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండోవిడత ఏకగ్రీవాల్లో ఒక ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. (నక్సల్‌ ప్రభావిత 5 జిల్లాల పరిధిలోని కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పరిధిలో గంట పోలింగ్‌ కుదించారు. మొత్తం 10,371 పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తిచేశారు. గురువారం ఉదయం నుంచే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన స్థానాలకు చేరుకోవడం మొదలైంది.

శుక్రవారం 31 జిల్లాల పరిధిలో (మేడ్చల్‌ జిల్లాలో తొలివిడతలోనే ఎన్నికలు పూర్తి) కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో పరిషత్‌ ఎన్నికలు ముగుస్తాయి. మిగిలిన 27 జిల్లాల్లో ఈ నెల 14న తుది విడత ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 27న అన్ని విడతలకు కలిపి పరిషత్‌ ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, గురువారం రూ.3.19 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కలిపి రూ. 83.61 లక్షల విలువైన నగదును, రూ.89.86 లక్షల విలువైన ఇతర వస్తువులను పోలీసులు, ఇతర అధికారులు జప్తుచేశారు. ఇప్పటివరకు 215 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 188 కేసుల్లో చర్యలు తీసుకున్నారు. 

మూడోవిడత జాబితా సిద్ధం... 
ఈ నెల 14న జరిగే మూడో విడత ఎన్నికలకు సంబంధించి రాజకీయపార్టీలు, ఇండిపెండెంట్‌లవారీగా పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయింపుతో ఈ విడతకు సంబంధించి రాజకీయపార్టీలు, అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఈ విడతకు సంబంధించి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది.  

1,738, ఎంపీటీసీలు, 161 జెడ్పీటీసీలకు... 
మూడో విడతలో 161 మండలాల పరిధిలో 1,738 ఎంపీటీసీ, 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు 5,726 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీలకు 741 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల విషయానికొస్తే సగటున ఐదు మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇదిలాఉంటే రెండో విడతలోనే ఎన్నికలు ముగియడంతో కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, మేడ్చల్‌–మల్కాజిగిరి, వరంగల్‌అర్భన్‌ జిల్లాల్లో మూడో విడతలో ఎన్నికలు లేవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement