రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు.
సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది.
దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది.
ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు.
ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్‌లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్‌పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి.
కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు.
ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి.
2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు.
రోడ్డు కావాలి..
మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట
చదువు ఆపేశాను
నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్‌రెడ్డి, వీరారెడ్డిగూడెం
-తాండ్ర కృష్ణగోవింద్
Comments
Please login to add a commentAdd a comment