village areas
-
ఆ పల్లెను చూసింది నలుగురు ఎమ్మెల్యేలే!
రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు. సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది. ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్‌లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్‌పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి. కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి. 2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు. రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట చదువు ఆపేశాను నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్‌రెడ్డి, వీరారెడ్డిగూడెం -తాండ్ర కృష్ణగోవింద్ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా..
నర్సంపేటరూరల్: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీఠ వేస్తానని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట రోడ్డులోని నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్‌లు హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుని నియోజకవర్గాల్లోనే క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారన్నారు. దీంతో అధికారులతో రివ్యూ సమావేశాలకు, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. రాజకీయ చరిత్రలో ఎవరూ చేయలేని పని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారన్నారు. నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందని, గతంలో కమ్యూనిస్టులు పాలించినప్పుడు పోరాటాలకే పరిమితమయ్యారని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో అనుకున్న మేర అభివృద్ధి జరగలేదని, కానీ, నర్సంపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిసారి ఎమ్మెల్యే ఓ పార్టీ, ఎంపీ మరోక పార్టీ, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరోపార్టీ గెలుస్తాయని, దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడేదని, ఈసారి ప్రజలంతా ముక్తకంఠంతో టీఆర్ఎస్ పార్టీని ఒక పక్షంగా గెలిపించారని, దీంతో మాకు బరువు బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. నర్సంపేటను సస్యశ్యామలం చేసేందుకు ఎక్కువ నిధులు వచ్చే విధంగా తోడ్పాడుతానన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం తో సర్పంచ్‌కు, ఉపసర్పంచ్ చెక్‌పవర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సర్వాధికారులు సర్పంచ్‌కే అప్పగించడం జరుగుతుందని, నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట మునిసిపల్ చైర్మన్ నాగెల్లి వెంకట నారాయణరెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాయిని నర్సయ్య, కౌన్సిలర్లు, అన్ని మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో సేవలు ప్రశంసనీయం
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సేవలను కొనియాడిన ప్రముఖులు కపిలేశ్వరపురంలో సెకండరీ ఐ సెంటర్ ప్రారంభం కపిలేశ్వరపురం : గ్రామీణ ప్రాంతాల్లో సెంటర్లను ప్రారంభించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నేత్ర వైద్యసేవలను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అందించడం ప్రశంసనీయమని పలువురు వక్తులు కొనిడాయారు. కపిలేశ్వరపురంలో శనివారం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గొడవర్తి సత్యనారాయణమూర్తి సెకండరీ ఐ సెంటర్‌ను ప్రారంభించారు. సంస్థ చైర్మన్ జీఎన్ రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎన్ఏఎస్సీఓఎం చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, శ్రీ సర్వారాయ సుగర్స్ ఎండీ ఎస్బీపీఎస్ కృష్ణమోహన్, అమలాపురం, రాజమండ్రి ఎంపీలు పండుల రవీంద్రబాబు, ఎం.మురళీమోహన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆస్పత్రిలోని పలు విభాగాలను ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవర ణలో ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పరుచూరి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జీఎన్‌రావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 16 సంస్థలను స్థాపించి గ్రామీణుల నేత్ర పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. సంస్థల ఏర్పాటుకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కామినేని మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ సంస్థ గ్రామీణప్రాంతాలవారికి మెరుగైన సేవలందించడం అభినందించదగినదన్నారు. బీవీఆర్ మోహనరావు మాట్లాడుతూ వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా సమాజం కోసం కృషి చేయడమే జీవితలక్ష్యంగా భావించాలన్నారు. ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, సర్వారాయ సుగర్స్ ఎండీ కృష్ణమోహన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇలాంటి సంస్థ స్థాపించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ మునిప్రసాద్, ఎంపీపీ కె. వెంకటరాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జె.సూర్యావతి, ప్రముఖులు వి.సాయికుమార్‌బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్∙రెడ్డి ప్రసాద్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
నవ్యాత్మక ఆలోచనలతో.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్
మెచ్చిన కంపెనీలో నచ్చిన వేతనంతో కొలువులో స్థిరపడదామనే వ్యక్తిగత ఆలోచన నుంచి నలుగురికి ఉపాధి కల్పించే వ్యవస్థగా ఎందుకు మారకూడదు అనే దిశగా ఆలోచించే యువత సంఖ్య అధికమవుతోంది. స్వయం ఉపాధికి కొత్త భాష్యం చెబుతున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు నవ్యాత్మక ఆలోచనలే ఆసరాగా.. ఉత్సాహంగా కదులుతోంది నవతరం. ఈ నేపథ్యంలో ఎంటర్ ప్రెన్యూర్షిప్ అంటే ఏమిటి? ఇందుకు కావాల్సిన నైపుణ్యాలు? ఇందులోకి ఎలా ప్రవేశించాలి? తదితర అంశాలపై ఫోకస్.. భారత భావి ఆర్థిక వ్యవస్థలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కీలకమైన మార్పులకు నాందిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరికొందరు ఆర్థిక వ్యవస్థకు ఇది చుక్కాని వంటిదని అభివర్ణిస్తున్నారు. దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విప్లవం కొనసాగుతోంది. దీని ప్రాచుర్యం కేవలం మెట్రో, పట్టణ ప్రాంతాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. గ్రామీణ ప్రాంతాలకు సైతం శరవేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా చెప్పుకోదగ్గ స్థాయిలో వివిధ రంగాల్లో విజయవంతమైన స్టార్టప్‌లు (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను స్టార్టప్‌లు అని కూడా అంటారు) ప్రారంభమయ్యాయి. స్టార్టప్.. అంటే? క్లుప్తంగా చెప్పాలంటే కంపెనీకి చెందిన ఒక ప్రయోగాత్మక దశ. మరోవిధంగా చెప్పాలంటే.. ఏ వస్తువులను తయారు చేస్తున్నారు? వాటిని ఎవరికి విక్రయిస్తున్నారు? అనే లక్ష్యాలను వివరించే నివేదిక వంటిది. ఉదాహరణకు.. శాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఆ సంస్థకు లక్షిత వినియోగదారులు ఎవరు? వారిని ఏవిధంగా చేరుకోవాలి? అనే అంశంపై కంపెనీకి స్పష్టమైన అవగాహన ఉంది. అంటే అది ప్రయోగాత్మక దశను దాటి అమలు చేసే(ఎగ్జిక్యూషన్ ఫేజ్) నిర్ణయాత్మక అంకానికి చేరుకుంది. ఒక వస్తువును రూపొందించాలని భావిస్తే.. గతంలో ముందుగా సంబంధిత అంశంపై పరిశోధనను ప్రారంభించేవారు. కానీ, ప్రస్తుతం కంపెనీ ముందుగా సదరు వస్తువును తయారు చేసేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసిన/చేస్తున్న ఔత్సాహికులు ఎవరైనా ఉన్నారా? అని పరిశీలిస్తుంది. అలా ముందుకు వచ్చిన వారి ఉత్పత్తులను వివిధ పద్ధతుల్లో పరీక్షించి, అనుమతినిస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఎగిరే కార్లను (ఫ్లైయింగ్ కార్) తయారు చేయాలంటే.. ఆ స్టార్టప్‌ను ప్రారంభించడానికి ముందు పరిగణించాల్సిన అంశాలు.. ఎగిరే కారును రూపొందించడం సాధ్యమా? కాదా? ఎంత ఖర్చవుతుంది? కొనుగోలుదారులెవరు? దీర్ఘకాలిక వ్యాపారంగా దీన్ని భావించవచ్చా? ఈ విధంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ స్టార్టప్‌ను ప్రారంభిస్తే.. అది విజయవంతమైన కంపెనీగా రూపాంతరం చెందుతుంది. మూడు తేడాలు స్టార్టప్-బిజినెస్ మధ్య స్థూలంగా మూడు తేడాలు ఉంటాయి. అవి..1. స్కేల్ 2. అనిశ్చితి 3. ఎకో సిస్టమ్. స్కేల్ స్టార్టప్‌నకు, సంప్రదాయ వ్యాపారానికి మధ్య ఉన్న మౌలిక అంతరం స్కేల్ (స్థాయి). ఉదాహరణకు జిరాక్స్ సెంటర్ ద్వారా సంవత్సరానికి పది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వచ్చే ఏడాది లేదా మరుసటి ఏడాది పెద్దగా మారకపోవచ్చు. స్టార్టప్ విషయానికొస్తే గమనించాల్సిన ప్రధాన అంశం ఎటువంటి ఆదాయం లేకుండానే ఇది ప్రారంభమవుతుంది. ఎందుకంటే వస్తువును రూపొందించే దశలోనే స్టార్టప్ మొదలవుతుంది. ఇటువంటి సమయంలో వస్తువును ఉత్పత్తి చేయడానికి, ప్రాచుర్యం కల్పించడానికి ఎక్కువ పెట్టుబడి కావాలి. ఆ వస్తువు మార్కెట్లోకి విడుదలైన తర్వాతే ఆదాయం రావడం మొదలవుతుంది. ఒక సంవత్సరం ఆ వస్తువును పది వేల మంది కొంటే.. మరో సంవత్సరం లక్ష మంది కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. సంబంధిత శాఖలను ఏర్పాటు చేస్తే మినహా జిరాక్స్ సెంటర్ వంటి సంప్రదాయ వ్యాపారాల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి దీన్ని హాకీ స్టిక్ మోడల్ గ్రోత్‌గా వ్యవహరిస్తారు. అనిశ్చితి స్టార్టప్‌నకు, సంప్రదాయ వ్యాపారానికి మధ్య ఉన్న మరో అంతరం అనిశ్చితి స్థాయి. ఉదాహరణకు జిరాక్స్ సెంటర్ ప్రారంభిస్తే..దాన్నుంచి ఎంత ఆదాయం వస్తుంది? అనే విషయాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు. స్టార్టప్‌ల విషయంలో ఇలాంటి అంచనా సాధ్యం కాదు. ఎందుకంటే స్టార్టప్‌లో అనిశ్చితి అనేది కొంత క్లిష్టతతో కూడి ఉంటుంది. ఉదాహరణకు ఎగిరే కారు విషయంలో పైన ప్రస్తావించిన అంశాలను విస్తృత దృష్టితో అధ్యయనం చేయాలి. కాబట్టి అనిశ్చితిని అంచనా వేయడం కొద్దిగా కష్టం. ఎకో సిస్టమ్ స్టార్టప్‌ల కోసం కొంతకాలంగా సంప్రదాయ వ్యాపార వ్యవస్థకు భిన్నమైన వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి, నిర్వహించడానికి కొంత ప్రారంభ పెట్టుబడి అవసరం. స్టార్టప్ విషయంలో కూడా ఈ పెట్టుబడి తప్పనిసరి. ఈ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి అనుసరించే ప్రాధాన్యత క్రమం సంప్రదాయ వ్యాపారానికి భిన్నంగా ఉంటుంది. ఒక కంపెనీ స్థాపించాలనుకుంటే.. రుణం కోసం బ్యాంకును ఆశ్రయిస్తాం. స్టార్టప్ విషయంలో పెట్టుబడుల కోసం క్యాపిటల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లను సంప్రదించాలి. రిస్క్‌తో కూడినప్పటికీ లాభాలు వస్తాయనే ముందు చూపుతో వీరు పెట్టుబడిని సమకూర్చుతారు. వీరికి స్టార్టప్‌లలో ఈక్విటీ షేర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఒక సమస్యకు విజయవంతమైన, లాభదాయకమైన పరిష్కారాన్ని కనుక్కోవడమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ క్రమంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి.. టెక్నికల్ ఎక్స్పర్టైజ్, డోమైన్ ఎక్స్పర్టైజ్, ఎంటర్‌ప్రెన్యూరల్ ఎక్స్పర్టైజ్, బిజినెస్ ఎక్స్పర్టైజ్. సొంతంగా స్టార్టప్ స్టార్టప్‌పై పూర్తి అవగాహన పెంచుకున్న తర్వాత కార్య రంగంలోకి అడుగుపెట్టొచ్చు. స్టార్టప్ పనితీరుపై వినియోగదారుల నుంచి స్పందనలను స్వీకరించాలి. వాటికనుగుణంగా వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలి. స్టార్టప్ పనితీరు విశ్లేషించే ఏదో ఒక మాధ్యమం ఉండే విధంగా చూసుకోవడం మంచిది. అంతేకాకుండా ఇటువంటి అంశాల్లో తోడ్పడేందుకు ఇంక్యుబేటర్/యాక్సిలేటర్ ప్రోగ్రామ్‌లలో చేరాలి. సహ భాగస్వామిగా చేరండి స్టార్టప్ విషయంలో చాలా మందికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అన్ని సమస్యలను ఒక్కరే పరిష్కరించలేరు. కాబట్టి ఆయా సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యక్తుల కోసం అన్వేషిస్తుంటారు. దీన్ని అవకాశంగా మలుచుకుని.. మీకు పట్టు ఉన్న రంగంలో ఎదురవుతున్న సమస్యకు పరిష్కారాన్ని సూచించడంతోపాటు సహ భాగస్వామిగా కూడా చేరొచ్చు. అధ్యయనం ఎంటర్ప్రెన్యూర్లుగా స్థిరపడాలనుకునే వారికి కావాల్సిన సాంకేతిక, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎన్నో కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి స్వల్పకాలిక కోర్సుల నుంచి ఆన్లైన్ కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-బెంగళూరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐ) వంటి విద్యా సంస్థలు అందజేస్తున్నాయి. ఐఐఐటీ-హైదరాబాద్ వంటి ఇన్స్టిట్యూట్లు టెక్నికల్‌గా కావాల్సిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ (www.niesbud.org).. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించి వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పెరుగుతున్న ప్రోత్సాహం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్.. అభివృద్ధి చెందిన దేశం స్థాయికి చేరాలంటే పది కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన మార్గం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కాబట్టి ఒకప్పటిలా కాకుండా స్టార్టప్‌లను ప్రారంభించాలనే ఔత్సాహికులకు ప్రస్తుతం ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, పెట్టుబడి సంస్థలు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి ఇందుకోసం కొత్తగా విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సాంకేతిక విద్యా సంస్థలు కూడా క్యాంపస్ నియామకాలతో పాటు విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మక ఆలోచనల్ని వెలికితీసి, వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. -ప్రశాంత్ మేక, హెడ్, స్ట్రాటజీ అండ్ బ్రాండింగ్, ఐఐఐటీ-హైదరాబాద్ -
గ్రామాలలో విద్యావంతులు పెరగాలి
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నత విద్యావంతుల శాతం తక్కువని యూజీసీ మాజీ చైర్మన్, ఐసీఎస్ఎస్ఆర్ చైర్మన్ సుఖ్‌దేవ్ తోరట్ పేర్కొన్నారు. గ్రామాల లో ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య పెరగాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ భవనంలో బుధవా రం నిర్వహించిన తొలి స్నాతకోత్సవానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా దేశంలో 18 నుంచి 22 ఏళ్ల వయసువారే ఉన్నత విద్య అభ్యసిస్తున్నారన్నారు. వీరిలో వెనుకబడిన వర్గాల వారు ఉన్నత విద్యను ఎంచుకోకుండా ఉపాధికి సంబంధించిన ఇతర విద్యావకాశాలు వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. ఉన్నత విద్యారంగంపై మతాలు, కులాలు, ధనవంతులు, పేదలు అనే పలు రకాల అంశాలు ప్రభావం చూ పుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యారంగంలో హిందువులు 21 శాతం, ముస్లింలు 16 శాతం, క్రిస్టియన్లు 15 శాతం ఉన్నారని తోరట్ పేర్కొన్నారు. హిం దువుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల శాతం పెరగాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లోకంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల నమోదు 35 శాతం తక్కువగా ఉందని, ఇందులో మహిళల నమోదు శాతం మూడోవంతేనని పేర్కొన్నారు. ఆంగ్లమాధ్యమంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారిలో పట్టణ ప్రాంతాల్లో 78 శాతం, గ్రామీణప్రాంతంలో 22 శాతం ఉన్నారన్నారు. ఈ అంశం ప్రజల జీవనోపాధులపై ప్రభావం చూపుతోందన్నారు. ఆంగ్ల మాధ్యమం అంటే భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. -
వడివడిగా సాగు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఊపందుకున్న వర్షాలతో జిల్లాలో పంటల సాగు పనులు ఊపందుకున్నాయి. గత నెలాఖరు వరకు సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు కురవడంతో సాగు పనులు మందగించాయి. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షాలు వరుసగా కురుస్తుండడంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1,73,959 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగయ్యేలా వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసి చర్యలకు ఉపక్రమించింది. ఈ సీజన్లో భాగంగా గురువారం నాటికి జిల్లాలో 1,43,256 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా.. 1,51,278 హెక్టార్లలో వ్యవసాయ పనులు కొనసాగుతున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ విస్తీర్ణంలో 87 శాతం పంటలు సాగవుతున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణం కంటే అధికంగా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌పై అన్నదాతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వరుస కరువు, వర్షాలతో నష్టపోయిన రైతులకు ఈ సీజన్ కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. జిల్లాలో సాగు ఆశాజనకంగానే ఉంది. సాధారణ విస్తీర్ణంలో 87శాతం పంటలు సాగయ్యాయి. ఇందులో మొక్కజొన్న. పత్తి పంటలు అంచనాలను మించి సాగయ్యాయి. ఆయా పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలంగా ఉండడంతో రైతులు సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 31,740 హెక్టార్లలో మొక్కజొన్న సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేయగా.. ఇప్పటికే 37,663 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా పత్తి 35,754 హెక్టార్లకుగాను 40,712 హెక్టార్లలో సాగైంది. వర్షాలు ఇదే తరహాలో ఉంటే ఈ విస్తీర్ణం మరింత పెరగనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఊపుకొనసాగేనా..! ఖరీఫ్ సీజన్ ప్రస్తుతానికి ఆశాజనకంగానే సాగుతున్నప్పటికీ.. సీజన్ ముగిసే నాటికి ఇదే తరహాలో వర్షాలుంటాయా అనే సందేహం నెలకొంది. ఈ సీజన్లో సాధారణం కంటే ఒకట్రెండుశాతం అధికంగా వర్షాలు కురిసినప్పటికీ.. గత రెండేళ్లుగా తీవ్ర కరువు ప్రభావంతో చెరువులు, కుంటలు పూర్తిగా అడుగంటాయి. భూగర్భ జలాలు కూడా క్షీణించాయి. దీంతో తాజాగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడా చెరువులు నిండిన దాఖల్లాలేవు. దీంతో సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు స్థాయిలో వర్షాలు కురవాల్సిఉంది.