ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ హరిత
నర్సంపేటరూరల్: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీఠ వేస్తానని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట రోడ్డులోని నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్‌లు హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుని నియోజకవర్గాల్లోనే క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారన్నారు. దీంతో అధికారులతో రివ్యూ సమావేశాలకు, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. రాజకీయ చరిత్రలో ఎవరూ చేయలేని పని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారన్నారు.
నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందని, గతంలో కమ్యూనిస్టులు పాలించినప్పుడు పోరాటాలకే పరిమితమయ్యారని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో అనుకున్న మేర అభివృద్ధి జరగలేదని, కానీ, నర్సంపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిసారి ఎమ్మెల్యే ఓ పార్టీ, ఎంపీ మరోక పార్టీ, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరోపార్టీ గెలుస్తాయని, దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడేదని, ఈసారి ప్రజలంతా ముక్తకంఠంతో టీఆర్‌ఎస్ పార్టీని ఒక పక్షంగా గెలిపించారని, దీంతో మాకు బరువు బాధ్యతలు మరింత పెరిగాయన్నారు.
నర్సంపేటను సస్యశ్యామలం చేసేందుకు ఎక్కువ నిధులు వచ్చే విధంగా తోడ్పాడుతానన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం తో సర్పంచ్‌కు, ఉపసర్పంచ్ చెక్‌పవర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సర్వాధికారులు సర్పంచ్‌కే అప్పగించడం జరుగుతుందని, నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట మునిసిపల్ చైర్మన్ నాగెల్లి వెంకట నారాయణరెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాయిని నర్సయ్య, కౌన్సిలర్లు, అన్ని మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment