సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఊపందుకున్న వర్షాలతో జిల్లాలో పంటల సాగు పనులు ఊపందుకున్నాయి. గత నెలాఖరు వరకు సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు కురవడంతో సాగు పనులు మందగించాయి. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షాలు వరుసగా కురుస్తుండడంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1,73,959 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగయ్యేలా వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసి చర్యలకు ఉపక్రమించింది. ఈ సీజన్‌లో భాగంగా గురువారం నాటికి జిల్లాలో 1,43,256 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా.. 1,51,278 హెక్టార్లలో వ్యవసాయ పనులు కొనసాగుతున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ విస్తీర్ణంలో 87 శాతం పంటలు సాగవుతున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణం కంటే అధికంగా..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌పై అన్నదాతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వరుస కరువు, వర్షాలతో నష్టపోయిన రైతులకు ఈ సీజన్ కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. జిల్లాలో సాగు ఆశాజనకంగానే ఉంది. సాధారణ విస్తీర్ణంలో 87శాతం పంటలు సాగయ్యాయి. ఇందులో మొక్కజొన్న. పత్తి పంటలు అంచనాలను మించి సాగయ్యాయి. ఆయా పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలంగా ఉండడంతో రైతులు సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 31,740 హెక్టార్లలో మొక్కజొన్న సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేయగా.. ఇప్పటికే 37,663 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా పత్తి 35,754 హెక్టార్లకుగాను 40,712 హెక్టార్లలో సాగైంది. వర్షాలు ఇదే తరహాలో ఉంటే ఈ విస్తీర్ణం మరింత పెరగనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే ఊపుకొనసాగేనా..!
ఖరీఫ్ సీజన్ ప్రస్తుతానికి ఆశాజనకంగానే సాగుతున్నప్పటికీ.. సీజన్ ముగిసే నాటికి ఇదే తరహాలో వర్షాలుంటాయా అనే సందేహం నెలకొంది. ఈ సీజన్లో సాధారణం కంటే ఒకట్రెండుశాతం అధికంగా వర్షాలు కురిసినప్పటికీ.. గత రెండేళ్లుగా తీవ్ర కరువు ప్రభావంతో చెరువులు, కుంటలు పూర్తిగా అడుగంటాయి. భూగర్భ జలాలు కూడా క్షీణించాయి. దీంతో తాజాగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడా చెరువులు నిండిన దాఖల్లాలేవు. దీంతో సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు స్థాయిలో వర్షాలు కురవాల్సిఉంది.
వడివడిగా సాగు..
Published Fri, Aug 16 2013 3:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement