నవ్యాత్మక ఆలోచనలతో.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్ | Entrepreneurship revolution to turn as self employee | Sakshi
Sakshi News home page

నవ్యాత్మక ఆలోచనలతో.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్

Published Sat, Oct 25 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

నవ్యాత్మక ఆలోచనలతో.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్

నవ్యాత్మక ఆలోచనలతో.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్

మెచ్చిన కంపెనీలో నచ్చిన వేతనంతో కొలువులో స్థిరపడదామనే వ్యక్తిగత ఆలోచన నుంచి  నలుగురికి ఉపాధి కల్పించే వ్యవస్థగా ఎందుకు మారకూడదు అనే దిశగా ఆలోచించే యువత సంఖ్య అధికమవుతోంది. స్వయం ఉపాధికి కొత్త భాష్యం చెబుతున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు నవ్యాత్మక ఆలోచనలే ఆసరాగా.. ఉత్సాహంగా కదులుతోంది నవతరం. ఈ నేపథ్యంలో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అంటే ఏమిటి? ఇందుకు కావాల్సిన నైపుణ్యాలు?  ఇందులోకి ఎలా  ప్రవేశించాలి? తదితర అంశాలపై ఫోకస్..
 
భారత భావి ఆర్థిక వ్యవస్థలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కీలకమైన మార్పులకు నాందిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరికొందరు ఆర్థిక వ్యవస్థకు ఇది చుక్కాని వంటిదని అభివర్ణిస్తున్నారు. దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విప్లవం కొనసాగుతోంది. దీని ప్రాచుర్యం కేవలం మెట్రో, పట్టణ ప్రాంతాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. గ్రామీణ ప్రాంతాలకు సైతం శరవేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా చెప్పుకోదగ్గ స్థాయిలో వివిధ రంగాల్లో విజయవంతమైన స్టార్టప్‌లు (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను స్టార్టప్‌లు అని కూడా అంటారు) ప్రారంభమయ్యాయి.
 
 స్టార్టప్.. అంటే?
 క్లుప్తంగా చెప్పాలంటే కంపెనీకి చెందిన ఒక ప్రయోగాత్మక దశ. మరోవిధంగా చెప్పాలంటే.. ఏ వస్తువులను తయారు చేస్తున్నారు? వాటిని ఎవరికి విక్రయిస్తున్నారు? అనే లక్ష్యాలను వివరించే నివేదిక వంటిది. ఉదాహరణకు.. శాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఆ సంస్థకు లక్షిత వినియోగదారులు ఎవరు? వారిని ఏవిధంగా చేరుకోవాలి? అనే అంశంపై కంపెనీకి స్పష్టమైన అవగాహన ఉంది. అంటే అది ప్రయోగాత్మక దశను దాటి అమలు చేసే(ఎగ్జిక్యూషన్ ఫేజ్) నిర్ణయాత్మక అంకానికి చేరుకుంది. ఒక వస్తువును రూపొందించాలని భావిస్తే.. గతంలో ముందుగా సంబంధిత అంశంపై పరిశోధనను ప్రారంభించేవారు. కానీ, ప్రస్తుతం కంపెనీ ముందుగా సదరు వస్తువును తయారు చేసేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసిన/చేస్తున్న ఔత్సాహికులు ఎవరైనా ఉన్నారా? అని పరిశీలిస్తుంది. అలా ముందుకు వచ్చిన వారి ఉత్పత్తులను వివిధ పద్ధతుల్లో పరీక్షించి, అనుమతినిస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఎగిరే కార్లను (ఫ్లైయింగ్ కార్) తయారు చేయాలంటే.. ఆ స్టార్టప్‌ను ప్రారంభించడానికి ముందు పరిగణించాల్సిన అంశాలు.. ఎగిరే కారును రూపొందించడం సాధ్యమా? కాదా? ఎంత ఖర్చవుతుంది? కొనుగోలుదారులెవరు? దీర్ఘకాలిక వ్యాపారంగా దీన్ని భావించవచ్చా? ఈ విధంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ స్టార్టప్‌ను ప్రారంభిస్తే.. అది విజయవంతమైన కంపెనీగా రూపాంతరం చెందుతుంది.
 
 మూడు తేడాలు
 స్టార్టప్-బిజినెస్ మధ్య స్థూలంగా మూడు తేడాలు ఉంటాయి. అవి..1. స్కేల్  2. అనిశ్చితి 3. ఎకో సిస్టమ్.
 
 స్కేల్
 స్టార్టప్‌నకు, సంప్రదాయ వ్యాపారానికి మధ్య ఉన్న మౌలిక అంతరం స్కేల్ (స్థాయి). ఉదాహరణకు జిరాక్స్ సెంటర్ ద్వారా సంవత్సరానికి పది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వచ్చే ఏడాది లేదా మరుసటి ఏడాది పెద్దగా మారకపోవచ్చు. స్టార్టప్ విషయానికొస్తే గమనించాల్సిన ప్రధాన అంశం ఎటువంటి ఆదాయం లేకుండానే ఇది ప్రారంభమవుతుంది. ఎందుకంటే వస్తువును రూపొందించే దశలోనే స్టార్టప్ మొదలవుతుంది. ఇటువంటి సమయంలో వస్తువును ఉత్పత్తి చేయడానికి, ప్రాచుర్యం కల్పించడానికి ఎక్కువ పెట్టుబడి కావాలి. ఆ వస్తువు మార్కెట్లోకి విడుదలైన తర్వాతే ఆదాయం రావడం మొదలవుతుంది. ఒక సంవత్సరం ఆ వస్తువును పది వేల మంది కొంటే.. మరో సంవత్సరం లక్ష మంది కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. సంబంధిత శాఖలను ఏర్పాటు చేస్తే మినహా జిరాక్స్ సెంటర్ వంటి సంప్రదాయ వ్యాపారాల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి దీన్ని హాకీ స్టిక్ మోడల్ గ్రోత్‌గా వ్యవహరిస్తారు.  
 
 అనిశ్చితి
 స్టార్టప్‌నకు, సంప్రదాయ వ్యాపారానికి మధ్య ఉన్న మరో అంతరం అనిశ్చితి స్థాయి. ఉదాహరణకు జిరాక్స్ సెంటర్ ప్రారంభిస్తే..దాన్నుంచి ఎంత ఆదాయం వస్తుంది? అనే విషయాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు. స్టార్టప్‌ల విషయంలో ఇలాంటి అంచనా సాధ్యం కాదు. ఎందుకంటే స్టార్టప్‌లో అనిశ్చితి అనేది కొంత క్లిష్టతతో కూడి ఉంటుంది. ఉదాహరణకు ఎగిరే కారు విషయంలో పైన ప్రస్తావించిన అంశాలను విస్తృత దృష్టితో అధ్యయనం చేయాలి. కాబట్టి అనిశ్చితిని అంచనా వేయడం కొద్దిగా కష్టం.
 
 ఎకో సిస్టమ్
 స్టార్టప్‌ల కోసం కొంతకాలంగా సంప్రదాయ వ్యాపార వ్యవస్థకు భిన్నమైన వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి, నిర్వహించడానికి కొంత ప్రారంభ పెట్టుబడి అవసరం. స్టార్టప్ విషయంలో కూడా ఈ పెట్టుబడి తప్పనిసరి. ఈ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి అనుసరించే ప్రాధాన్యత క్రమం సంప్రదాయ వ్యాపారానికి భిన్నంగా ఉంటుంది. ఒక కంపెనీ స్థాపించాలనుకుంటే..  రుణం కోసం బ్యాంకును ఆశ్రయిస్తాం. స్టార్టప్ విషయంలో పెట్టుబడుల కోసం క్యాపిటల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లను సంప్రదించాలి. రిస్క్‌తో కూడినప్పటికీ లాభాలు వస్తాయనే ముందు చూపుతో వీరు పెట్టుబడిని సమకూర్చుతారు.  వీరికి స్టార్టప్‌లలో ఈక్విటీ షేర్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
 
 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
 అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఒక సమస్యకు విజయవంతమైన, లాభదాయకమైన పరిష్కారాన్ని కనుక్కోవడమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ క్రమంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి.. టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్, డోమైన్ ఎక్స్‌పర్టైజ్, ఎంటర్‌ప్రెన్యూరల్ ఎక్స్‌పర్టైజ్, బిజినెస్ ఎక్స్‌పర్టైజ్.
 
 సొంతంగా స్టార్టప్
 స్టార్టప్‌పై పూర్తి అవగాహన పెంచుకున్న తర్వాత కార్య రంగంలోకి అడుగుపెట్టొచ్చు. స్టార్టప్ పనితీరుపై వినియోగదారుల నుంచి స్పందనలను స్వీకరించాలి. వాటికనుగుణంగా వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలి. స్టార్టప్ పనితీరు విశ్లేషించే ఏదో ఒక మాధ్యమం ఉండే విధంగా చూసుకోవడం మంచిది. అంతేకాకుండా ఇటువంటి అంశాల్లో తోడ్పడేందుకు ఇంక్యుబేటర్/యాక్సిలేటర్ ప్రోగ్రామ్‌లలో చేరాలి.  
 
 సహ భాగస్వామిగా చేరండి
 స్టార్టప్ విషయంలో చాలా మందికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అన్ని సమస్యలను ఒక్కరే పరిష్కరించలేరు. కాబట్టి ఆయా సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యక్తుల కోసం అన్వేషిస్తుంటారు. దీన్ని అవకాశంగా మలుచుకుని.. మీకు పట్టు ఉన్న రంగంలో ఎదురవుతున్న సమస్యకు పరిష్కారాన్ని సూచించడంతోపాటు సహ భాగస్వామిగా కూడా చేరొచ్చు.
 
 అధ్యయనం
 ఎంటర్‌ప్రెన్యూర్లుగా స్థిరపడాలనుకునే వారికి కావాల్సిన సాంకేతిక, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎన్నో కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి స్వల్పకాలిక కోర్సుల నుంచి ఆన్‌లైన్  కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-బెంగళూరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐ) వంటి విద్యా సంస్థలు అందజేస్తున్నాయి. ఐఐఐటీ-హైదరాబాద్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు టెక్నికల్‌గా కావాల్సిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (www.niesbud.org).. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించి వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 పెరుగుతున్న ప్రోత్సాహం
 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్.. అభివృద్ధి చెందిన దేశం స్థాయికి చేరాలంటే పది కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన మార్గం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కాబట్టి ఒకప్పటిలా కాకుండా స్టార్టప్‌లను ప్రారంభించాలనే ఔత్సాహికులకు ప్రస్తుతం ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, పెట్టుబడి సంస్థలు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి ఇందుకోసం కొత్తగా విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సాంకేతిక విద్యా సంస్థలు కూడా  క్యాంపస్ నియామకాలతో పాటు విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మక ఆలోచనల్ని వెలికితీసి, వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి.
 -ప్రశాంత్ మేక, హెడ్, స్ట్రాటజీ అండ్ బ్రాండింగ్,
 ఐఐఐటీ-హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement