కాగితం కరెన్సీని మొదట ఉపయోగించినవారు ఎవరు? | Who was the first use of paper currency? | Sakshi
Sakshi News home page

కాగితం కరెన్సీని మొదట ఉపయోగించినవారు ఎవరు?

Published Tue, Dec 16 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

కాగితం కరెన్సీని మొదట ఉపయోగించినవారు ఎవరు?

కాగితం కరెన్సీని మొదట ఉపయోగించినవారు ఎవరు?

ద్రవ్యం - భావనలు: సమాజంలో ప్రతి పరిణామంలో కీలక పాత్ర పోషించే ద్రవ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత నాగరిక సమాజంలో ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే వివిధ పనులకు ద్రవ్యం అవసరం తప్పనిసరి. ప్రాచీనకాలం నుంచి ఉన్న ద్రవ్య రూపాలను, ద్రవ్య విధులను, ద్రవ్య రకాలను, ద్రవ్య విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
 -    సమాజాభివృద్ధికి ఊతమిచ్చే ఈ ద్రవ్యం పూర్వకాలంలో వాడుకలో లేదు. ద్రవ్యం వినియోగంలోకి రాకముందు వస్తు వినిమయ పద్ధతి ఉండేది. దీన్నే వస్తుమార్పిడి పద్ధతి, బార్టర్ పద్ధతి అని పిలిచేవారు.
 -    ఒక వ్యక్తి తన దగ్గరున్న ఒక వస్తువును ఇంకొకరికి ఇచ్చి దానికి బదులుగా అతని దగ్గరున్న తనకు కావాల్సిన మరొక వస్తువును పొందడాన్ని వస్తుమార్పిడి పద్ధతి అంటారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు తమకు కావాల్సిన వస్తువులను పరస్పరం మార్చుకుంటారు. ఆధునిక కాలంలో ప్రతిరంగంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో వస్తుమార్పిడి పద్ధతి ఆచరణలో అసౌకర్యంగా ఉండడం వల్ల పరస్పర మార్పిడి కోసం ద్రవ్యమనే ఉమ్మడి కొలమానాన్ని ప్రవేశపెట్టారు.
 
 ద్రవ్యం- నిర్వచనం
 ద్రవ్యాన్ని ఆంగ్లంలో మనీగా పిలుస్తారు. మనీ అనే పదం ‘మానెటా’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రోమన్లు తమ ఆరాధ్యదేవతైన జునో మొనేటా ఆలయంలో నాణేలను ముద్రించడం వల్ల ఆ లాటిన్ పదం ఉత్పన్నమైందని తెలుస్తోంది. ద్రవ్యమంటే మార్పిడి మాధ్యమంగా, విలువల కొలమానంగా అందరూ అంగీకరించి ఉపయోగించేది. అంటే ద్రవ్యాన్ని ఉపయోగించే వారందరితో అది ఆమోదం పొంది ఉండాలి.
 -    సెలిగ్‌మేన్ అనే ఆర్థికవేత్త ప్రకారం సర్వాం గీకారం పొందిందే ద్రవ్యం.
 -    వాకర్ అభిప్రాయం ప్రకారం ద్రవ్యవిధులను నిర్వహించేదే ద్రవ్యం. (Money is what money does)
 ద్రవ్యం- పరిణామక్రమం
 పురాతన కాలం నుంచి ద్రవ్యం వివిధ రూపాలుగా రూపాంతరం చెందుతూ చలామణీలో ఉంది.
     వస్తురూప ద్రవ్యం: తొలిగా వస్తువు ద్రవ్య రూపంగా ఉండేది. ధాన్యం, పండ్లు, గవ్వ లు, బట్టలు, జంతువుల చర్మాలు, దంతాలను ద్రవ్యంగా వాడేవారు. ప్రపంచంలో చాలాచోట్ల ఇవి వాడుకలో ఉండేవి. మన దేశంలో ఆర్య నాగరికత (వేద నాగరికత) కాలంలో గోవులను ‘గోధనం’గా భావించి ద్రవ్యంగా ఉపయోగించేవారు. వీటిని వినిమయ సాధనాలుగా భావించేవారు.
     లోహ ద్రవ్యం: లోహ పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత లోహాలతో చేసిన నాణేలు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటగా క్రీ.పూ.700లో లిబియా ప్రాంతంలో నాణేలను ద్రవ్య రూపాలుగా జారీ చేశారు. రోమన్లు ‘బిసాంత్’ అనే బంగారు నాణేలను, మౌర్యులు ‘పానా’ అనే వెండి నాణేన్ని ద్రవ్యంగా వాడేవారు. కాలక్రమంలో ఇత్తడి, రాగి, కంచు, నికెల్, స్టీల్ నాణేలను ప్రవేశపెట్టారు.
     కాగితం ద్రవ్యం: ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ ‘కాగితం’. ప్రపంచమంతా కాగితం ద్రవ్యమే అమలులో ఉంది. వీటితో పాటు నాణేలు (coins) కూడా ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు దేశంలో బంగారు నిల్వల ఆధారంగా ఆ దేశ కేంద్ర బ్యాంక్ నోట్లను ముద్రించి విడుదల చేసేది. ప్రస్తుతం బంగారంతో సంబంధం లేకుండానే ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. మధ్యయుగం నాటి చైనాలో ‘సుంగ్’ వంశ రాజుల కాలంలో మొదటిసారిగా కాగితం ద్రవ్యం చలామణీలోకి వచ్చింది.
     పరపతి ద్రవ్యం (Credit money): దీనినే అప్పు ద్రవ్యం అంటారు. ఈ ద్రవ్యాన్ని బ్యాంకులు సృష్టిస్తాయి. అందువల్ల బ్యాంక్ ద్రవ్యం అని కూడా అంటారు. ఇంతకు ముందు బంగారం నిల్వ ఉంచుకొని కరెన్సీ విడుదల చేసే విధంగానే బ్యాంకులు కరెన్సీని నిల్వ (బ్యాంక్ డిపాజిట్లు) గా ఉంచుకొని పరపతి ద్రవ్యాన్ని జారీ చేస్తాయి. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులను ఈ ద్రవ్యానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
     సమీప ద్రవ్యం: ద్రవ్యానికి బదులుగా ద్రవ్యత్వం కల్పించేవాటిని సమీప ద్రవ్యం అంటారు. హుండీలు, ట్రెజరీ బిల్లులు, బాండ్లు మొదలైనవాటికి ద్రవ్యం ఆపాదించడం వల్ల అవి ద్రవ్యానికి ప్రత్యామ్నాయాలుగా మారతాయి. వీటికి ద్రవ్యానికి ఉండే లక్షణాలే ఉంటాయి.
 
 ద్రవ్యం రకాలు: ద్రవ్యాన్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
 1.     న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం
     కేంద్ర బ్యాంక్ (ఖఆఐ) జారీ చేసిన ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యంగా భావించవచ్చు. ఇది చట్టసమ్మతమైంది. అంటే దీన్ని చెల్లింపుల మాధ్యమంగా ఎవరూ తిరస్కరించడానికి వీలు లేదు. ఈ న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం రెండు రకాలు.
 
     పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ద్రవ్యాన్ని కొంత పరిమితి వరకే అంగీకరించేది పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. ఆ పరిమితిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పరిమితికి మించి ద్రవ్యాన్ని ఆమోదించమని ఒత్తిడి చేయడం నేరం. ఉదా॥భారతదేశంలో తక్కువ విలువ ఉన్న నాణేలైన 5, 10, 20, 25 పైసల నాణేలను * 25 పరిమితికి మించి తీసుకొమ్మని ఎవరినీ బలవంతం చేయకూడదు. వినియోగదారుడు అమ్మకందారుడికీ *25 రూపాయలకు మించి చిల్లర నాణేలు ఇస్తే అమ్మకందారుడు అంగీకరించాల్సిన అవసరం లేదు.
     అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ఈ ద్రవ్యాన్ని ఎంతమొత్తమైనా, ఎలాంటి పరిమితి లేకుండా వినిమయానికి అందరూ అంగీకరించాలి. అంగీకరించకపోతే నేరం. ఉదా॥భారతదేశంలో * 50 పైసలకు మించిన విలువ గల నాణేలను, 1 రూపాయి నుంచి * 1000 నోటు వరకు ఉన్న కరెన్సీని ఎంత మొత్తమైనా స్వీకరించాలి.
 
 2.    ఇచ్ఛాపూర్వక ద్రవ్యం (చట్టబద్ధం కాని ద్రవ్యం): ఈ ఐచ్చిక ద్రవ్యానికి చట్ట సమ్మతి లేదు. ఇది నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ద్రవ్యాన్ని అంగీకరించకపోయినా నేరం కాదు. చెక్కులు, డ్రాఫ్టులు, డిబెంచర్లు, షేర్లు, క్రెడిట్ కార్డులు, హుండీలు (బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్) మొదలైన వాటిని ఐచ్చిక ద్రవ్యంగా పరిగణించవచ్చు. ఈ ద్రవ్యాన్ని బ్యాంక్ ద్రవ్యం, దగ్గర ద్రవ్యం అని కూడా అంటారు.
     చెక్కులు: ఖాతాదారుడు (వినియోగదారు డు) తన బ్యాంకులో జమచేసిన సొమ్ము నుంచి తనకు, తను సూచించిన వ్యక్తికి తను కోరిన సొమ్మును జారీ చేయమని కోరడమే చెక్కు. ఖాతాదారుడు తన అకౌంట్‌లో తగినంత ద్రవ్యం ఉన్నప్పుడే చెక్కులు చెల్లుతాయి. లేకపోతే బ్యాంకులు చెక్కులను తిరస్కరిస్తాయి. వినిమయ మాధ్యమంగా చెక్కులు ఉపయోగపడుతున్నాయి.
     డ్రాఫ్టులు: వీటిని బ్యాంకులు జారీ చేస్తాయి. వ్యక్తులు, సంస్థల నుంచి  సొమ్మును, దానికి నిర్ధారించిన కొంత కమిషన్ సొమ్మును తీసుకున్న బ్యాంకులు, వారు కోరిన విధంగా, కోరిన వారి పేరుపై, వారు చెల్లించిన సొమ్ము మేరకు డ్రాఫ్టులు జారీ చేస్తాయి. వినియోగదారుడు (డ్రాఫ్టులపై పేరు గలవారు) తన బ్యాంక్‌లో ఆ డ్రాఫ్ట్‌ను సమర్పించి అంతే సొమ్మును డిమాండ్ చేసి తీసుకోవచ్చు. అందుకే దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) అంటారు. చెక్కుల కంటే డ్రాఫ్టులు ఆమోదయోగ్యమైనవి. ఎందుకంటే సొమ్మును ముందే చెల్లిస్తారు కాబట్టి బ్యాంకుల నుంచి చెల్లింపులు నిర్ధారణగా జరుగుతాయి.
     బాండులు: ద్రవ్యం మూల్యనిధి కాబట్టి ప్రజలు తమ వద్ద కొంత డబ్బును నిల్వ ఉంచుకుందామని ఆశపడతారు. డబ్బును ఆర్థిక సెక్యూరిటీల రూపంలోనైనా భద్రపరుచుకోవాలని అనుకొంటారు. అందుకు బాండు సరైన ఆర్థిక సెక్యూరిటీ ఇస్తుంది. బాండు అంటే బేరరు (వినియోగదారుడు)కు కొంత నిర్ణీతకాలం తర్వాత నిర్ణీత వడ్డీతో కలిపి చెల్లిస్తామని వాగ్దానం చేసే కాగితం పత్రం. అవసరమైతే వీటిని బ్యాంకుల్లో కుదవపెట్టి దానిపై రుణాలను తీసుకోవచ్చు. వీటిని మన దేశంలో ఆర్‌బీఐ లేదా దాని అనుమతి పొందిన సంస్థలు, తపాలా కార్యాలయాలు (N పత్రాలు, ఇందిరా వికాస పత్రాలు) జారీ చేస్తాయి.
 
     డిబెంచర్లు: ఇవి కూడా బాండ్లలాంటివే. వీటిని కంపెనీలు, సంస్థలు ఒక నిర్ణీత వడ్డీతో జారీ చేస్తాయి. డబ్బు అవసరమైనప్పుడు బేరర్ వాటిని ఇతరులకు అమ్మవచ్చు. వాటిని గుర్తించిన సంస్థల్లో తనఖాపెట్టి  అప్పు కూడా తీసుకోవచ్చు.
     బ్యాంక్ క్రెడిట్ కార్డులు:  బ్యాంకులు ఎంపిక చేసిన కొంతమంది ఖాతాదారులకు, వారి కోరికమేరకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ కార్డుదారులు ఎంపిక చేసిన వ్యాపార సంస్థల్లో బిల్లులు చెల్లించడానికి వీటిని ఉపయోగిస్తారు. వారు బిల్లు మొత్తాన్ని  ద్రవ్యరూపంలో చెల్లించరు. కార్డును దుకాణదారు  వద్ద నున్న చిన్న మిషన్‌లో స్వైప్ చేసి, ఆ బిల్లుపై సంతకం చేస్తారు. అప్పుడు బిల్లును బ్యాంకు చెల్లించి తర్వాత వినియోగదారుడి నుంచి ఆ సొమ్మును వసూలు చేస్తుంది. నిర్ణీత కాలంలో సొమ్మును వినియోగదారుడు చెల్లించకపోతే వడ్డీతో సహా జరిమానా వేసి  కార్డును జారీ చేసిన సంబంధిత బ్యాంక్ నగదు వసూలు చేస్తుంది. అయితే ఖాతాదారుడు తన అకౌంటులో ఏ మాత్రం సొమ్ము లేకపోయినా బ్యాంక్ నిర్ధారించిన మేరకు సొమ్మును ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఖర్చు చేసుకోవచ్చు.
 
     ఆధునిక ఆర్థిక లావాదేవీల్లో ఎక్కువగా ఐచ్చిక ద్రవ్యాన్నే ప్రధానమైన ద్రవ్య వినిమయంగా ఉపయోగిస్తున్నారు. అది  సులువుగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల సౌకర్యవంతమైన సాధనంగా మారింది. పైన పేర్కొన్న ఐచ్చిక ద్రవ్యంతోపాటు బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్, హుండీలు కూడా ద్రవ్య వినిమయంగా ఉన్నాయి. ద్రవ్యం ద్రవ్యవినిమయంగానేకాకుండా విలువల కొలమానంగా, భవిష్యత్తులో చెల్లింపుల కొలమానంగా, మూల్యనిధి లేదా విలువల నిధిగా వివిధ విధులను నిర్వర్తిస్తుంది. ఈ ద్రవ్యాన్ని ముద్రించడానికి, ద్రవ్య విధానాన్ని రూపొందించడానికీ మనదేశంలో 1934 చట్టం ద్వారా రిజర్‌‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను ఏర్పాటు చేశారు. దేశంలో ద్రవ్యాధికారం ఉన్న ఏకైక కేంద్ర బ్యాంక్  ఆర్‌బీఐ.
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 కానిస్టేబుల్ పరీక్ష దృష్ట్యా ‘ద్రవ్యం - భా వనలు’ పాఠ్యభాగాన్ని ఎలా చదవాలి?
 - కె.రామకృష్ణ, నల్గొండ
 పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష దృష్ట్యా సాంఘిక శాస్త్ర ప్రశ్నల్లో 6 నుంచి 8 ప్రశ్నలు అర్థశాస్త్రం నుంచే వస్తాయి. ముఖ్యంగా 8, 9, 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని అర్థశాస్త్ర విషయాలను అభ్యర్థులు బాగా చదివి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈసారి ఇంటర్ స్థాయిలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి కిందిస్థాయి పాఠ్యాంశాలలోని అర్థశాస్త్ర భావన లను ఇంటర్‌లో విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. వాటిని చదవడం వల్ల విషయంపై అవగాహన పెరుగుతుంది. అర్థశాస్త్ర అంశాలపై అభ్యర్థికి ఉన్న ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలే ఉంటాయి. ప్రధానంగా అర్థశాస్త్ర మౌలిక భావనలతోపాటు, జాతీయ తలసరి ఆదాయం, ఉత్పత్తి-పంపిణీ, బడ్జెట్, ప్రభుత్వ వ్యయం, ఆదాయం, ద్రవ్యం, బ్యాంకింగ్, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సమస్యలు, పంచవర్ష ప్రణాళికల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.  
 
 అడ్మిషన్‌‌స: ఐఐఎం- లక్నో
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్    (ఐఐఎం)- లక్నో కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కెల్లే స్కూల్ ఆఫ్ బిజినెస్(కేఎస్‌బీ), ఇండియానా యూనివర్సిటీ, యూఎస్‌ఏల  సంయుక్తాధ్వర్యంలో ఐఐఎం- లక్నో ఈ కోర్సును నిర్వహిస్తోంది.
  సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్.
 అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
 దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 10
 వెబ్‌సైట్: http://www.iiml.ac.in/
 
 ఎంబీఏ ప్రోగ్రామ్
 గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(ఏబీవీ - ఐఐఐటీఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  ఎంబీఏ ప్రోగ్రామ్
 విభాగాలు: ఆపరేషన్స్, మార్కెటింగ్, ఐటీ అండ్ సిస్టమ్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సోషల్ సెక్టార్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్.
 కాలపరిమితి: రెండేళ్లు
 అర్హతలు: ఏదైనా ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా సైన్స్‌లో పీజీతో పాటు డిగ్రీలో ఆపరేషన్ రీసెర్చ్/కంప్యూటర్ సైన్స్/ఎకనామిక్స్/కామర్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి.
 ఎంపిక: క్యాట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జనవరి 30
 వెబ్‌సైట్: http://www.iiitm.ac.in/
 
 కువెంపు యూనివర్సిటీ
 షిమోగాలోని కువెంపు యూనివర్సిటీకి చెందిన డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్  కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  గ్రాడ్యుయేట్ కోర్సులు
 విభాగాలు: బీఏ, బీకామ్, బీబీఎం, బీఎస్సీ.
  పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
 విభాగాలు:
 ఎంఏ(రెండేళ్లు): కన్నడం, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎడ్యుకేషన్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ.
 ఎమ్మెస్సీ (రెండేళ్లు): మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ.
  పీజీ డిప్లొమా కోర్సులు(ఏడాది):
 విభాగాలు: కన్నడ కంప్యూటర్స్, కన్నడ జర్నలిజం, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ మార్కెట్స్.
 అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31 (రూ.400 లేట్ ఫీతో)
 వెబ్‌సైట్: www.kuvempuuniversitydde.org/
 బొమ్మనబోయిన శ్రీనివాస్
 సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement