సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే మంత్రి పదవి రాక ముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు.
ప్రజల మధ్యే ఉంటూ..
పాల్వంచ పారిశ్రామికంగా ఎదుగుతున్న తరుణంలో వార్డు సభ్యుడిగా వనమా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రజల్లోనే ఉండేవారు. ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపై పంచాయతీ పరిధిలో అన్ని వార్డులు, గ్రామాలకు వెళ్లి వచ్చేవారు. ఆ తర్వాత సర్పంచ్‌గా ఎన్నికై న వనమా చేస్తున్న కృషిని అప్పటి కలెక్టర్లు ఈమని పార్థసారధి, పీవీఆర్‌కే ప్రసాద్ మెచ్చుకున్నారు. ఆ రోజుల్లోనే మూడుసార్లు ఉత్తమ సర్పంచ్‌గా నాటి గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పరకాల శేషాచలం చే తులమీదుగా బంగారుపతకాలను అందుకున్నారు. ఆ తర్వాత అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రో త్సాహంతో చిన్న వయసులోనే భూ తనఖా (ల్యాండ్ మార్టిగేజ్) బ్యాంక్‌కు చైర్మన్‌గా ఎన్నికై ప్రతిభ చూపారు. 1989లో కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
రికార్డుస్థాయిలో ఇళ్ల మంజూరు..
పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో కొత్తగూడెం నియోజకవర్గానికే 18 వేల ఇళ్లు మంజూరు చేయించి రికార్డు సృష్టించారు. ఇది చూసి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ మంత్రి వర్గంలో వైద్య విధాన పరిషత్ మంత్రిగా పని చేశారు. పాల్వంచ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశారు. నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా ఉంటూ వచ్చారు.
మంత్రిగా పోటీ చేసి ఓటమి..
2009 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో పోటీ చేసిన వనమా ఓడిపోయారు. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా పోటీ చేయగా సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చేతిలో వనమా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వనమాకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. వరుసగా రెండు ఓటముల తర్వాత చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో 2018లో ఇవే తనకు చివరి ఎన్నికలంటటూ హస్తం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికే కరోనా కారణంగా ప్రజల్లో ఎక్కువగా తిరగలేకపోయారు. ఆ వెంటనే వనమా కుమారుడు రాఘవపై పోలీస్ కేసులు నమోదు కావడం ఆయనకు ఇబ్బందులు తెచ్చింది. ఇటీవల కాలంలో కొత్తగూడెం టికెట్ కోసం గులాబీ పార్టీలోనే ఆశావహుల నుంచి పోటీ ఎక్కువైంది. తీవ్రమైన పోటీని తట్టుకుంటూ మరోసారి కొత్తగూడెం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేది తానేనంటూ వనమా ధీమా ప్రకటించారు. ఈ తరుణంలో అనూహ్యంగా అనర్హత వేటుకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment