సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఎన్నికల వేళ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు గడ్డు పరిస్థితులు ఎదురువుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్యే భర్త, హరిసింగ్ నాయక్ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ పార్టీ వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటూ అసలుకే ఎసరు తెచ్చారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్‌ఎస్.. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా జెట్ స్పీడ్‌తో పట్టాలెక్కిస్తోంది.
నియోజకవర్గాల వారీగా పార్టీ విజయావకాశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 18 మందికి టికెట్లు గల్లంతు కావొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ 18 మందిలో జిల్లా నుంచి ఎవరైనా ఉన్నారా అనే ఆరాలు పెరిగాయి. నిన్నా మొన్నటి వరకు ఈ విషయంలో కొత్తగూడెం నియోజకవర్గ పేరు ఎక్కువగా వినిపించేది. వనమా ఎన్నికపై దాఖలైన కేసు తీర్పు, సుప్రీం కోర్టులో సవాల్ తదితర అంశాలతో ప్రస్తుతం కొత్తగూడెం సైడ్ ట్రాక్‌లోకి వెళ్లగా, ఆ స్థానాన్ని ఇల్లెందు నియోజకవర్గం ఆక్రమించింది.
మా అభ్యర్థన ఆలకించండి..
గత ఆరు నెలలుగా ఇల్లెందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు తిరిగి టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించలేమని, తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. హరిప్రియకు బదులు ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో కూడా పార్టీ పెద్దలకు ఇప్పటికే సూచించారు. అయితే ఈ అంశంపై బీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలిసింది. కానీ గత రెండు వారాలుగా పరిస్థితిలో తేడా వచ్చింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు ఇల్లెందుపై దృష్టి పెడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు.
జీవన్‌లాల్ సేవా క్యాంపులు..
వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తనయుడు జీవన్‌లాల్ రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ ఉద్యోగిగా ఆయన కొనసాగుతున్నారు. ఇంతవరకూ హైదరాబాద్‌కే ఎక్కువగా పరిమితం అయిన జీవన్‌లాల్.. సిట్టింగ్ అభ్యర్థుల్లో కొన్ని మార్పులు ఉంటాయనే ప్రచారంతో పావులు కదపడం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఆయన ఇల్లెందులో క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లెందు నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగానే ఇక్కడ క్యాంప్ వెలిసిందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.
షాడో ప్రభావం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుంచి హరిప్రియ కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వేదికగా హరిసింగ్ ఇటు ప్రభుత్వ, అటు పార్టీ కార్యక్రమాల్లో చక్రం తిప్పుతున్నారు. షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ తనకంటూ సొంత వర్గం ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అప్పటివరకు పార్టీలో పని చేస్తూ వచ్చిన నేతలంతా తీవ్ర అసౌకర్యానికి గురవడం మొదలైంది.
ద్వితీయ శ్రేణి నేతలు, వారి అభిప్రాయాలను హరిసింగ్ ఖాతరు చేయడం లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కామేపల్లి, గార్ల, బయ్యారం, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో కారు పార్టీ నేతలకు హరిసింగ్ వ్యవహార శైలితో కంటి మీద కునుకు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని కొందరు గులాబీ నేతలే అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మండలాల వారీగా ఉన్న అసమ్మతి నాయకులంతా ఒక్కటవుతున్నారు. షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ హరిసింగ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు..
జూలైలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఇటీవల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ఆమె ఇల్లెందు నియోజకవర్గానికి వచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ స్థానికంగా లేరు. కవిత మాటల వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనే చర్చ మొదలైంది. మహబూబాబాద్ జిల్లాలోని రెండు స్థానాల్లో పార్టీ టికెట్ దక్కని పక్షంలో ఇల్లెందు నుంచైనా అసెంబ్లీకి పోటీ చేసేందుకు కవిత రెడీగా ఉన్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment