జాతరకు పోటెత్తిన భక్త జనం
సాక్షి, పాడేరు: అల్లూరిసీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మూడు రోజులుగా జరుగుతున్న గిరిజన ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉత్సవాలకు రూ.కోటి కేటాయించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆది, సోమవారాల్లో మోదకొండమ్మ తల్లిని దర్శించుకోగా, మంగళవారం ఉత్సవాల చివరి రోజున రాష్ట్ర టూరిజం మంత్రి ఆర్‌కే రోజా దర్శించుకున్నారు. సాయంత్రం అనుపోత్సవాన్ని నిర్వహించారు.
ఊరేగింపు సంబరం అంబరాన్ని తాకింది. చోడవరం, అరకు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చెట్టి పాల్గుణతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.
అల్లూరి జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కృషి: మంత్రి రోజా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకులోయ ప్రాంతాలను పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమను రోజా సమర్పించారు.
అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న మంత్రి రోజా
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి హిల్స్‌తో పాటు పలు జలపాతాలు, వలిసె పువ్వులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. గిరిజ నుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడంతో గిరిజనులపై సీఎంకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment