Modakondamma Temple
-
ముగిసిన మోదమ్మ గిరిజన జాతర
సాక్షి, పాడేరు: అల్లూరిసీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మూడు రోజులుగా జరుగుతున్న గిరిజన ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉత్సవాలకు రూ.కోటి కేటాయించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆది, సోమవారాల్లో మోదకొండమ్మ తల్లిని దర్శించుకోగా, మంగళవారం ఉత్సవాల చివరి రోజున రాష్ట్ర టూరిజం మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. సాయంత్రం అనుపోత్సవాన్ని నిర్వహించారు. ఊరేగింపు సంబరం అంబరాన్ని తాకింది. చోడవరం, అరకు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చెట్టి పాల్గుణతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కృషి: మంత్రి రోజా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకులోయ ప్రాంతాలను పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమను రోజా సమర్పించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న మంత్రి రోజా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి హిల్స్‌తో పాటు పలు జలపాతాలు, వలిసె పువ్వులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. గిరిజ నుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడంతో గిరిజనులపై సీఎంకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు. -
తల్లి జోలికి వచ్చారో..??
మోదకొండమ్మ ఆలయం అప్పగింతపై నిరసన రాజకీయాలకు అతీతంగా నేడు బంద్‌కు పిలుపు బాలరాజు తీరును ఎండగడుతున్న భక్తులు పాడేరు, న్యూస్‌లైన్ : పాడేరులోని మోదకొండమ్మ ఆలయా న్ని దేవాదాయ శాఖ పరిధిలో చేర్చడాన్ని భక్తులు, రాజకీయ, వర్తక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏళ్లనాటి నుంచీ అమ్మవారి ఆలయాన్ని తాము కాపాడుకుంటూ వస్తున్నామని, అసలు గుడిపై ఏ హక్కు ఉందని మంత్రి బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం అమ్మవారి ఆలయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, పాడేరు గ్రామ పెద్దలు, వర్తక సంఘం నేతలు సమావేశమయ్యారు. వీరంతా బాలరాజు నిరంకుశ విధానాలను ఎండగట్టారు. ఆలయ అభివృద్ధ్దికి పైసా కూడా ఖర్చుపెట్టని వ్యక్తి పదవి ముగుస్తున్న సమయంలో దాన్ని దేవాదాయ శాఖకు అప్పగించడాన్ని తప్పుబట్టారు. మాజీ మంత్రి ఎం.మణికుమారి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ, బీజేపీ నేత కురుసా బొజ్జయ్య, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, వర్తక సంఘం అధ్యక్షులు రొబ్బి శంకరరావు, టీడీపీ నేతలు బొర్రా నాగరాజు, విజయరాణి, కొట్టగుల్లి సుబ్బారావు, రొబ్బి రాముల ఆధ్వర్యంలో సమావేశమై ఆలయాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన బూనారు. మణికుమారి మాట్లాడుతూ ఆలయ కమిటీ, ధర్మకర్తలు, వర్తక సంఘం, గ్రామ పెద్దలంతా అమ్మవారి ఆలయానికి కృషి చేస్తే ఎక్కడ నుంచో వచ్చిన మంత్రి పెత్తనం చెలాయించడం దారుణమన్నారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాలరాజు చర్యలను ప్రతీ ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. వంజంగి కాంతమ్మ మాట్లాడుతూ మోదకొండమ్మతల్లి ఆలయం మంత్రి బాలరాజుకు సొత్తు కాదన్నారు. నేడు బంద్ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించడాన్ని నిరసిస్తూ గురువారం పాడేరు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆలయాన్ని యథావిధిగా భక్తుల ఆధీనంలోనే ఉంచే వరకు పోరాడతామని నేతలు స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు నవర గోవిందరావు, బి.కెజియారాణి, పూసర్ల గోపి, నిక్కుల సింహాచలం, వెల్డింగ్ శ్రీను, లకే రత్నాభాయి పాల్గొన్నారు.