ఖాళీ అయిన గోవింద్ పూర్ గ్రామం , కొత్తచోట ఇంటిని నిర్మించుకుంటున్న గిరిజన మహిళ
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోవింద్‌పూర్‌లో కలవరం
మూడేళ్ల వ్యవధిలో 12 మంది మృతి
ఇంకా అనేక మందిని పీడిస్తున్న మూత్రపిండాల సమస్య
భూగర్భ జలాలు తాగునీటిగా వినియోగించడం వల్లేనన్న ఆందోళన... ఒక్కొక్కరుగా ఊరు వదిలిన వైనం
గతంలోనే అప్రమత్తం చేసిన ‘సాక్షి’
తాంసి: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం. కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు న్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుంటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయేంతగా..! విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురు కిడ్నీ (మూత్రపిండాలు) సంబంధిత వ్యాధుల బారిన పడటం, ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం.
గడిచిన మూడేళ్లలో ఈ వ్యాధి బారిన పడి 12 మంది మృత్యుఒడికి చేరారు. గ్రామంలోని చేద బావులు, చేతిపంపుల నీటిని తాగడం వల్లే తమ కిడ్నీలు పాడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్న భీంపూర్ మండలం కమట్‌వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవింద్‌పూర్ గిరిజనులంతా గ్రామాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లిపోయారు.
హామీలిచ్చి మరిచిపోయారు
ఆదిలాబాద్ జిల్లా గోవింద్‌పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు చేద బావుల నీటినే గిరిజనులువినియోగించే వారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. యువకులు సైతం వ్యాధుల బారిన పడుతుండటంతో ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన ‘సాక్షి’ 2022 నవంబర్ 4న ‘ఊరొదిలిపోతున్నారు..’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది.
దీంతో కొందరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని భరోనా ఇచ్చారు. కానీ హామీలేవీ నెరవేరలేదు. క్రమంగా జబ్బుపడే వారి సంఖ్య, మరణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఊరు ఖాళీ చేసి పక్కనే ఉన్న అడవి సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గుడ్డి దీపాలతో నెట్టుకొస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాల కోసం పక్కనున్న చెరువు, వాగు నీటిని వినియోగిస్తున్నారు.
నీటిలో అధికంగా భార మూలకాలు
‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భీంపూర్ వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల రక్త, మూత్ర నమూనాలు, గ్రామంలోని చేతిపంపుల నుంచి నీటిని సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. నీటిలో భార మూలకాల శాతం అధికంగా ఉందని, ఈ కారణంగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయని అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అప్పట్నుంచీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
సమస్య తీవ్రత చెప్పినా పట్టించుకోలేదు
బోరు బావి నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని అధికారులకు మొర పెట్టుకున్నాం. దీంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– జమునబాయి, మాజీ సర్పంచ్, గోవింద్‌పూర్
భార్యను బతికించుకోవాలనుకున్నా కానీ..
నా భార్య కుమ్ర భీంబాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పరిక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు రెండేళ్ల కిందటే మా గ్రామాన్ని వదిలేసి పక్కనే ఉన్న జెండా గూడకు వలసవెళ్లాం. కానీ కొన్నాళ్లకే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి చనిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు గ్రామానికి దూరంగా ఉంటూ, వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచే చేసుకుంటున్నా.
– కుమ్ర పరశురాం, గోవింద్‌పూర్ గ్రామస్తుడు
మరోసారి వైద్య పరీక్షలు చేస్తాం
గోవింద్‌పూర్ గ్రామాన్ని వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. స్థానికులు గ్రామాన్ని విడిచివెళ్లిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. గతంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశాం. మరోసారి నీటి పరీక్షలతో పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– నిఖిల్ రాజ్, భీంపూర్ మండల వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment