ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి బంధువులు పోటీ పడటం కొత్తేమీ కాదు. అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ళ ఇలా రక్త సంబంధీకులు కూడా చాలా చోట్ల పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల నుంచి అక్కా చెల్లెళ్ళ పోటీ పడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో..యుద్ధంలో గెలిచేదెవరో చూద్దాం.
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ సీటు దక్కించుకోవడానికి అధికార బీఆర్ఎస్.. సీటు నిలుపుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆరు నూరైనా ఆసిఫాబాద్ దక్కించుకోవాల్సిందేనని కేడర్‌ను సిద్ధం చేస్తున్నాయి.
ఆదివాసీలైన గోండుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది వారే. అన్ని పార్టీలు ఆ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దించడం సర్వసాధారణం. అందుకే గోండుల సామ్రాజ్యంలో గులాబీ జెండాను ఎగురవేయడానికి అసిపాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
కోవ లక్ష్మి 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవ లక్ష్మి తప్పకుండా విజయం సాధిస్తారని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో కోవ లక్ష్మిని కట్టడి చేయడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. కోవ లక్ష్మి మీద ఆమె స్వంత చెల్లెలిని బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతోంది. కోవ లక్ష్మి, మర్సకోల సరస్వతి మాజీ రాష్ట్ర మంత్రి కోట్నాక భీమ్‌రావు బిడ్డలు కావడం విశేషం.
గులాబీ పార్టీ అక్క లక్ష్మికి టిక్కెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చెల్లెలు సరస్వతి దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవ లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు. అయితే కోవలక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్ నడుస్తోంది. అక్క మీద ఉన్న వ్యతిరేకతే తనకు అనుకూలంగా మారుతుందని సరస్వతి భావిస్తున్నారట. అక్కడ మీద తాను తప్పకుండా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సరస్వతి గతంలో ఒకసారి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజల్లో పలుకుబడి లేని చెల్లెలు తనకు పోటీయే కాదంటున్నారు కోవ లక్ష్మి. తాను సునాయసంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న అక్కా చెల్లెళ్ళ యుద్ధంలో ఆదివాసీలు ఎటువైపు నిలుస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment