kova lakshmi
-
గోండు సామ్రాజ్యంలో అక్కా చెల్లెళ్ళ పోటీ?.. ఆదివాసీలు ఎటువైపు!
ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి బంధువులు పోటీ పడటం కొత్తేమీ కాదు. అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ళ ఇలా రక్త సంబంధీకులు కూడా చాలా చోట్ల పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల నుంచి అక్కా చెల్లెళ్ళ పోటీ పడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో..యుద్ధంలో గెలిచేదెవరో చూద్దాం. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ సీటు దక్కించుకోవడానికి అధికార బీఆర్ఎస్.. సీటు నిలుపుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆరు నూరైనా ఆసిఫాబాద్ దక్కించుకోవాల్సిందేనని కేడర్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఆదివాసీలైన గోండుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది వారే. అన్ని పార్టీలు ఆ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దించడం సర్వసాధారణం. అందుకే గోండుల సామ్రాజ్యంలో గులాబీ జెండాను ఎగురవేయడానికి అసిపాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోవ లక్ష్మి 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవ లక్ష్మి తప్పకుండా విజయం సాధిస్తారని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో కోవ లక్ష్మిని కట్టడి చేయడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. కోవ లక్ష్మి మీద ఆమె స్వంత చెల్లెలిని బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతోంది. కోవ లక్ష్మి, మర్సకోల సరస్వతి మాజీ రాష్ట్ర మంత్రి కోట్నాక భీమ్రావు బిడ్డలు కావడం విశేషం. గులాబీ పార్టీ అక్క లక్ష్మికి టిక్కెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చెల్లెలు సరస్వతి దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవ లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు. అయితే కోవలక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్ నడుస్తోంది. అక్క మీద ఉన్న వ్యతిరేకతే తనకు అనుకూలంగా మారుతుందని సరస్వతి భావిస్తున్నారట. అక్కడ మీద తాను తప్పకుండా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి గతంలో ఒకసారి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజల్లో పలుకుబడి లేని చెల్లెలు తనకు పోటీయే కాదంటున్నారు కోవ లక్ష్మి. తాను సునాయసంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న అక్కా చెల్లెళ్ళ యుద్ధంలో ఆదివాసీలు ఎటువైపు నిలుస్తారో చూడాలి. -
అభ్యర్థి కిడ్నాప్.. జెడ్పీటీసీ ఏకగ్రీవం..!
కొమురం భీం ఆసిఫాబాద్: తుది విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా జైనూర్ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి జైనూర్ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, కోవా లక్ష్మీ కుట్రకు పాల్పడ్డారని జైనూర్ బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి మైసన్ శేకు అతని భార్య చంద్రకళ ఆరోపించారు. ‘మా ఇద్దరినీ కిడ్నాప్ చేసి వేర్వేరు చోట్ల బంధించారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు’ అని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. కోవా లక్ష్మీ ఏకగ్రీవాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని శేకు, చంద్రకళ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జైనూర్ చౌరస్తాలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేయడం గమనార్హం. రెండో విడత పరిషత్ ఎన్నికలు శుక్రవారం (మే 10) జరిగాయి. -
సమర్థులను పోటీకి దించండి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్ధులను పోటీకి దించండని నేతలను కోరారు. గ్రామస్థాయిలో వంద శాతం టీఆర్ఎస్ పార్టీ బలోపేతమవ్వాలని తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళణ తీసుకొని వస్తున్నామని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు ధర్నాలు చేసినా పట్టించుకోవద్దని సూచించారు. జీహెచ్ఎంసీలో కూడా ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇంచార్జులను నియమించారు. ఈ ఎన్నికల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ప్రధాన కార్యదర్శులకు కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీని, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధును ప్రకటించారు. -
జిల్లా ఏర్పాటు చరిత్రాత్మకం
రెబ్బెన : అన్ని రంగాల్లో వెనకబడిన ఆసిఫాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయటం చారిత్రాత్మకమని తెలంగాణ గౌడ సంఘం నియోజక వర్గ ఇన్చార్జి మోడెం సుదర్శన్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కుంమ్రం భీం జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ది చెందేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి జిల్లాను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో గౌడసంఘం మండల అధ్యక్షుడు అన్నపూర్ణ, సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి కిష్టాగౌడ్, నాయకులు చిరంజీవిగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, రాజాగౌడ్, ఉమేష్‌గౌడ్, రాజాగౌడ్, మహేష్‌గౌడ్, శాంతికుమార్‌గౌడ్, సర్వేశ్వర్గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వర్సెస్ సబ్‌కలెక్టర్
విగ్రహం ఏర్పాటుపై వివాదం పనులు అడ్డుకున్న సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సంఘటనా స్థలంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు ఆసిఫాబాద్ : గిరిజన నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ కొట్నాక భీమ్రావు విగ్రహ ఏర్పాటు నిర్మాణంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ మధ్య వివాదం తలెత్తింది. ఆసిఫాబాద్‌లోని జూబ్లీ మార్కెట్ సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై స్వర్గీయ భీమ్రావు విగ్రహ ప్రతిష్టాపనకు నిర్మాణ పనులు ప్రారంభించారు. గమనించిన సబ్ కలెక్టర్ శుక్రవారం రాత్రి నిర్మాణ స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అనుమతి లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని, పనులు నిలిపి వేసి, తవ్విని గోతిని పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, గిరిజన సంఘాల నాయకులు అక్కడి చేరుకున్నారు. సబ్ కలెక్టర్‌ను సముదాయించగా, అనుమతి లేకుండా చేపట్టవద్దని తేల్చిచెప్పారు. ప్రారంభించిన పనులు నిలిపి వేయాలన్నారు. కాగా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొస్తామని, రెండు రోజులు గడువు ఇవ్వాలని ఆ సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు కోరారు. దీంతో అంతటితో ఆ గొడవ సద్దుమణిగింది. శనివారం మరోచోట తవ్వకం.. ఈ క్రమంలోనే శనివారం ఉదయం పెద్దవాగు బ్రిడ్జి సమీపంలోని పంప్‌హౌజ్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుకు అనుకూలంగా ఉండడంతో ప్రొక్లెయినర్‌తో పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్, సీఐ సతీష్‌కుమార్, తహశీల్దార్ బక్కయ్య అధికారులతో అక్కడికి చేరుకున్నారు. యథావిధిగా పనులను నిలిపివేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో అక్కడికి చేరుకొని పనులు ఎందుకు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని, మొదటిసారి చేసిన తప్పు రెండో సారి చేయడం సరికాదన్నారు. ఆదివాసీ నాయకుడి విగ్రహ నిర్మాణం ఆపడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సమస్య జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సంఘటనా స్థలంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్తగా ఆ స్థలంలో పోలీసులు మోహరించారు. -
బెర్త్ ఎవరికో..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/చెన్నూరు : ఎన్నో రోజులుగా ఊరిస్తున్న మంత్రి వర్గ విస్తరణ అంశం ఎట్టకేలకు తెరపైకి రావడంతో ఈ పదవులను ఆశి స్తున్న నేతలతోపాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కం ఠ నెలకొంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రకటించిన మాదిరిగానే చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు ప్రభుత్వ విప్ పదవి ఖరారైంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓదేలుకు సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితునిగా పేరుంది. ప్రభుత్వ విప్‌గా ఓదెలు పేరు గతంలోనే వినిపించినా ఇప్పటికి ఖరారైంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఇంద్రకరణ్‌రెడ్డికి సీనియర్ నేతగా పేరుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో సొంత చరిష్మతో విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆయన అనుచర వర్గాలు భావిస్తున్నాయి. అలాగే కోవ లక్ష్మికి కూడా ఈ పదవి దక్కడంలో సమీకరణాలు కలిసొస్తున్నాయని ఆమె అనుచర వర్గాలు భావిస్తున్నాయి. ఆమెకు ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇటు మహిళా కోటా, మరోవైపు గిరిజనుల కోటా కింద పదవి ఇచ్చినట్లు అవుతుందని, పైగా ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కోవ లక్ష్మి అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేటెడ్ పదవులపై.. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఎమ్మెల్యేలను నియమిం చాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అలాగే పార్లమెంట్ సెక్రటరీలుగా ఎ మ్మెల్యేలను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేల్లో ఈ పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగా మంత్రి వర్గంలో చేరే మంత్రులు ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ పదవులు దక్కనున్న వారికి ఆది, సోమవారాల్లో కేసీఆర్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలున్నాయి. బాధ్యత మరింత పెరిగింది : ఓదెలు బంగారు తెలంగాణ నిర్మాణంలో మరింత బాధ్యత పెరిగిందని చెన్నూ ర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. ప్రభుత్వం నల్లాల ఓదెలును శని వారం ప్రభుత్వ విప్‌గా నియమించగా ‘సాక్షి’ ఆయనను ఫోన్లో పలకరించింది. ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతోనే ప్రభుత్వ విప్‌గా నియమించారని తెలిపారు. కేసీఆర్ ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరిస్తానన్నారు. అన్ని రంగాల్లో నియోజవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు. -
‘విస్తరణ’పై ఆశలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మంత్రివర్గ విస్తరణపై కదలిక రావడంతో అమాత్య పదవులు ఆశిస్తున్న జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వారంలో కేసీఆర్ తన కేబినేట్లోకి మరికొంత మందిని తీసుకునే అవకాశాలుండటంతో జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్నకు మంత్రి పదవి దక్కింది. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు చీఫ్ విప్‌గా నియామకం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎస్.వేణుగోపాలాచారి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. మొత్తానికి మంత్రి వర్గంలో జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం దక్కింది. ఈ విస్తరణలో మరొకరికి ఈ పదవి వరించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్షి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. మహిళా కోటా కింద ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి స్థానం దక్కే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ కేబినేట్లో ఇప్పటివరకు మహిళలు లేరు. పైగా ఎస్టీలకు కూడా అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి విస్తరణలో ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. తెలంగాణలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చందూలాల్, శంకర్ నాయక్‌లు ఉండగా, మిగిలిన ముగ్గురు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా కోవలక్ష్మి ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన వారు. లక్ష్మి అవకాశం కల్పిస్తే ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. ఎస్టీ మహిళగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందని ఆమె అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.