ఎమ్మెల్యే వర్సెస్ సబ్‌కలెక్టర్
విగ్రహం ఏర్పాటుపై వివాదం
పనులు అడ్డుకున్న సబ్ కలెక్టర్
ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
సంఘటనా స్థలంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
ఆసిఫాబాద్ : గిరిజన నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ కొట్నాక భీమ్‌రావు విగ్రహ ఏర్పాటు నిర్మాణంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ మధ్య వివాదం తలెత్తింది. ఆసిఫాబాద్‌లోని జూబ్లీ మార్కెట్ సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై స్వర్గీయ భీమ్‌రావు విగ్రహ ప్రతిష్టాపనకు నిర్మాణ పనులు ప్రారంభించారు. గమనించిన సబ్ కలెక్టర్ శుక్రవారం రాత్రి నిర్మాణ స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
అనుమతి లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని, పనులు నిలిపి వేసి, తవ్విని గోతిని పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులు, గిరిజన సంఘాల నాయకులు అక్కడి చేరుకున్నారు. సబ్ కలెక్టర్‌ను సముదాయించగా, అనుమతి లేకుండా చేపట్టవద్దని తేల్చిచెప్పారు. ప్రారంభించిన పనులు నిలిపి వేయాలన్నారు. కాగా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొస్తామని, రెండు రోజులు గడువు ఇవ్వాలని ఆ సందర్భంలో టీఆర్‌ఎస్ నాయకులు కోరారు. దీంతో అంతటితో ఆ గొడవ సద్దుమణిగింది.
శనివారం మరోచోట తవ్వకం..
ఈ క్రమంలోనే శనివారం ఉదయం పెద్దవాగు బ్రిడ్జి సమీపంలోని పంప్‌హౌజ్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, టీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుకు అనుకూలంగా ఉండడంతో ప్రొక్లెయినర్‌తో పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్, సీఐ సతీష్‌కుమార్, తహశీల్దార్ బక్కయ్య అధికారులతో అక్కడికి చేరుకున్నారు.
యథావిధిగా పనులను నిలిపివేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో అక్కడికి చేరుకొని పనులు ఎందుకు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని, మొదటిసారి చేసిన తప్పు రెండో సారి చేయడం సరికాదన్నారు. ఆదివాసీ నాయకుడి విగ్రహ నిర్మాణం ఆపడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సమస్య జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సంఘటనా స్థలంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్తగా ఆ స్థలంలో పోలీసులు మోహరించారు.