‘విస్తరణ’పై ఆశలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మంత్రివర్గ విస్తరణపై కదలిక రావడంతో అమాత్య పదవులు ఆశిస్తున్న జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వారంలో కేసీఆర్ తన కేబినేట్‌లోకి మరికొంత మందిని తీసుకునే అవకాశాలుండటంతో జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్నకు మంత్రి పదవి దక్కింది. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు చీఫ్ విప్‌గా నియామకం ఖాయంగా కనిపిస్తోంది.
అలాగే జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎస్.వేణుగోపాలాచారి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. మొత్తానికి మంత్రి వర్గంలో జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం దక్కింది. ఈ విస్తరణలో మరొకరికి ఈ పదవి వరించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్షి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. మహిళా కోటా కింద ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి స్థానం దక్కే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ కేబినేట్‌లో ఇప్పటివరకు మహిళలు లేరు. పైగా ఎస్టీలకు కూడా అవకాశం దక్కలేదు.
దీంతో ఈసారి విస్తరణలో ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. తెలంగాణలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు.
ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చందూలాల్, శంకర్ నాయక్‌లు ఉండగా, మిగిలిన ముగ్గురు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా కోవలక్ష్మి ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన వారు. లక్ష్మి అవకాశం కల్పిస్తే ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. ఎస్టీ మహిళగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందని ఆమె అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.