![Ahead of Gujarat Assembly Polls, Arvind Kejriwal Promises Sops for Tribals - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/8/Kejriwal.jpg.webp?itok=FCF7kDzg)
వడోదర: గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను అమలు చేస్తుందని, పంచాయతీ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకూ వర్తింపజేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. గుజరాత్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చీఫ్‌గా సీఎంకు బదులుగా గిరిజనుడినే నియమిస్తామన్నారు.
గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆయన ఈ మేరకు ముందుగానే ఎన్నికల హామీలను ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా గిరిజనులు ఇప్పటికీ వెనుకబాటుకు గురవుతున్నారన్నారు. ఆప్ నిజాయతీ దేశభక్తికి మారుపేరు కాగా, బీజేపీ అవినీతి, కల్తీమద్యానికి మారుపేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాబల్య చోటా ఉదయ్‌పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
‘మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గిరిజన గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక మొహల్లా క్లినిక్‌ను ఏర్పాటు చేస్తుంది. గిరిజనులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నెలకొల్పుతాం. కుల ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేయడంతోపాటు నీడ లేని వారికి పక్కా ఇల్లు నిర్మిస్తాం. గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్లు వేస్తాం’ అని వెల్లడించారు. గిరిజన ప్రాంతాలు, గిరిజన తెగల ప్రజల పరిపాలన, నియంత్రణలకు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. అదేవిధంగా, 1996లో తీసుకు వచ్చిన పంచాయతీ చట్టంతో గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో స్వయం పాలనకు వీలు కల్పిస్తుంది. (క్లిక్: బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!)
Comments
Please login to add a commentAdd a comment