మోగల్లులో ఏర్పాటు చేసిన అల్లూరి స్మారక కేంద్రం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన అగ్ని పుష్పమై వికసించారు. విప్లవ శంఖమై బ్రిటిష్ ముష్కరులకు ముచ్చెమటలు పోయించారు. మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ముస్తాబైంది. అదే జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లు ఆయన స్వస్థలం.
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అల్లూరి సీతారామరాజు ఖ్యాతిని ఇనుమడింపచేసేలా 125వ జయంతి వేడుకలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. భీమవరంలో క్షత్రియ సేవా సమితి నేతృత్వంలో సుమారు రూ.3 కోట్లతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దీనిని ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.
విలక్షణమైన విద్యార్థిగా..
భీమవరం పట్టణానికి సమీపంలోని పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్వస్థలం. సీతారామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో తల్లి సూర్యనారాయణమ్మ పుట్టింట జన్మించారు. ఆయన బాల్యం భీమవరం పరిసర ప్రాంతాల్లోనే సాగింది. సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. ముంబై వెళ్లి ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం నేర్చుకున్నారు. నరసాపురం, తణుకు పట్టణాల్లో కొంతకాలం ఫొటో స్టూడియోలు నడిపారు. సీతారామరాజు పుట్టాక 1902లో రాజమహేంద్రవరంలో స్టూడియో ప్రారంభించారు.
ఆయన పలు ప్రాంతాలు తిరగడంతో సీతారామరాజు బాల్యం, చదువు కూడా ఆయా గ్రామాల్లోనే సాగాయి. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో రాజమండ్రి నుంచి తల్లి సూర్యనారాయణమ్మ సోదరుడు అప్పలనర్సయ్య స్వగ్రామమైన భీమవరం సమీపంలోని కొవ్వాడకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే 1909లో భీమవరంలోని మిషన్ హైస్కూల్‌లో ఒకటో ఫారంలో చేరారు. తర్వాత ఆయనకు జ్వరం రావడంతో మూడు నెలల పాటు స్కూల్‌కు వెళ్లలేదు. అనంతరం రాజమండ్రి వెళ్లి అక్కడి స్కూల్లో తిరిగి ఫస్ట్ ఫారంలో చేరారు. అక్కడే యోగాభ్యాసంపై దృష్టి సారించి హఠయోగం, పతంజలి యోగం, వేదాంతం వంటి వాటిని అభ్యసించారు.
కళాకారుడిగానూ రాణింపు
సీతారామరాజుకు నాటకాలంటే ఆసక్తి. 1912 డిసెంబర్ 12న 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా పిఠాపురంలోని రాజా కళాశాలలో శశిరేఖా పరిణయం నాటకం ప్రదర్శించారు. అందులో సీతారామరాజు శశిరేఖ పాత్ర వేశారు. తర్వాత విశాఖలోని ఏవీఎన్ కాలేజీ హైస్కూల్లో నాలుగో ఫారం కొంతకాలం చదివి.. 1913 జూలై 2న నరసాపురం టేలర్ హైస్కూల్లో నాలుగో ఫారంలో చేరారు.
చించినాడలో గుర్రపు స్వారీ
టైలర్ హైస్కూల్లో నాలుగో ఫారం చదువుతున్నపుడు ప్రతి శని, ఆదివారాల్లో సమీపంలోని చించినాడ గ్రామం వెళ్లేవారు. అక్కడ పినతండ్రి పినతండ్రి రామకృష్ణంరాజు మిత్రుడైన మునసబుకు చెందిన గుర్రంపై స్వారీ, చదరంగం నేర్చుకున్నారు. అనంతరం తునిలో ఉంటున్న తల్లి వద్దకు చేరుకున్నారు. 1913–17 మధ్య తుని సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచారం చేసి ఆదివాసీ జీవితాలను పరిశీలించారు. అనంతరం విప్లవ బాట పట్టి మన్యం ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరు సాగించి 1924 మే 7న వీర మరణం పొందారు.
మోగల్లులో స్మారక కేంద్రం
మోగల్లులోని అల్లూరి సీతారామరాజు నివాసాన్ని అల్లూరి స్మారక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ సహకారంతో క్షత్రియ సేవా సమితి ఈ పనులు చేపట్టింది. భీమవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఏర్పాటు చేశారు.
సమీకరించి.. పోరాడారు
సాక్షి, అమరావతి: అటవీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను గమనించిన అల్లూరి సీతారామరాజు వారి కోసం 1919 నుంచి పోరుబాట పట్టారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు తిరుగుబాటు చేశారు. తొలుత అటవీ ఉత్పత్తులను కొల్లగొడుతూ.. గిరిజనులకు తగిన కూలీ ఇవ్వకపోవడంపై నిలదీశారు. గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంది.
ఆయుధాల కో సం అల్లూరి నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. గిరిజనుల్లో అల్లూరికి ఆదరణ పెరగడం, ఉద్యమం తీవ్రతరం కావడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అదనపు పోలీసు బలగాలను పంపి అల్లూరి పోరాటానికి అడ్దుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. మన్యం పితూరీగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటుని పరిగణించింది. తొలుత మలబారు సైన్యాన్ని రంగంలో దింపిన బ్రిటిష్ ప్రభుత్వం ఆపై అస్సాం రైఫిల్స్‌ను కూడా పంపింది.
తీవ్ర పోరాటంలో గాయపడి కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో గాయాలను శుభ్రం చేసుకుంటున్న అల్లూరిని అస్సాం రైఫిల్స్ దళాలు పట్టుకున్నాయి. పట్టుబడిన అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా, మార్గంమధ్యలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. అల్లూరి తప్పించుకుని పారిపోయే అవకాశం ఉండటంతో 1924 మే 7న కాల్చి చంపినట్టు మేజర్ గుడాల్ తన నివేదికలో ప్రకటించారు.
అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవీపేటకు తరలించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అల్లూరి çస్మృతివనంగా తీర్చిదిద్దారు. బ్రిటిషర్ల దారుణాలకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి 27 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోయిన అల్లూరిని మన్యం వీరుడిగా ప్రజలు కొనియాడుతారు. మన్యం పోరాటంలో అల్లూరిని అనుసరించిన 17 మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అండమాన్ సహా వివిధ జైళ్లలో బంధించింది. మరికొందరు పోరాటంలోనే ప్రాణాలు విడిచారు. మన్య పోరాటం ముగిసినా.. ఆ చైతన్య స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది.
పోలీస్ స్టేషన్లపై దాడులకు వందేళ్లు
► సీతారామరాజు తన బృందంతో పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఈ ఏడాదితో సరిగ్గా వందేళ్లు పూర్తయ్యింది. గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి ఆ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. ఆయన ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గంటందొర, ఎండు పడాలు, ఎర్రేసులతో పాటు సుమారు 300 మంది పాల్గొన్నారు.
► 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మొదటిసారి దాడి చేశారు. దాడికి ముందే నర్సీపట్నం వైపు వెళ్తున్న ఎస్సై లంబసింగి వద్ద అల్లూరికి ఎదురుపడగా.. ‘ఆయుధాల కోసం మీ స్టేషన్‌కే వెళ్తున్నాను’ అని రామరాజు చెప్పారని, అతడు మారు మాట్లాడక తప్పుకున్నట్టు చెబుతారు. ఈ దాడిలో 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, ఐదు కత్తులు, 14 బాయ్‌నెట్లను తీసుకెళుతున్నట్టు పోలీస్‌స్టేషన్ డైరీలో రాసి.. అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. æ ఆ మర్నాడు ఆగస్టు 23న కృష్ణదేవీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపైనా దాడులు కొనసాగాయి. చింతపల్లి దాడికి వందేళ్లు సమీపిస్తున్న సందర్భంగా తపాలా శాఖ స్మారక స్టాంపును ఆవిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment