ఓటేసేందుకు వెళ్తున్న గిరిజనులను అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసులు, నేతలు పేట్రేగిపోయారు. ఏపీలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికలకు వస్తున్న గిరిజనులను అడ్డుకుని వారిపై దౌర్జన్యానికి దిగారు. వారు వెళ్లే దారిలో అడ్డంగా బారికేడ్లు, గేట్లు పెట్టారు. కోవిడ్‌ను సాకుగా చూపుతూ కోరాపుట్ జిల్లా కలెక్టర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు, పోలీసులు ఆ గ్రామాల్లో మోహరించి గిరిజనులను అడుగడుగునా అడ్డుకున్నారు. ఆంధ్రాలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులపై గిరిజనం తిరగబడ్డారు.
తాము ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని, ఇప్పుడే ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. ఆంధ్రా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తోందని.. తాము ఆంధ్రాలోనే ఉంటామని నినదించారు. దారికి అడ్డంగా నిలిచిన ఒడిశా పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ ఓటేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనుల మధ్య జరిగిన తోపులాటలో మహిళా గిరిజన ఓటర్లు రోడ్డుపై పడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. అయినప్పటికీ పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లారు. పట్టుచెన్నేరు, పగులుచెన్నేరుల్లో రోడ్డుకు అడ్డుగా ఒడిశా అధికారులు వేసిన గేట్లను తోసేసి తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విరుచుకుపడ్డ ఐటీడీఏ పీవో
కొటియా గ్రామాలకు వెళ్తున్న గిరిజన సమీకృతాభి వృద్ధిసంస్థ (ఐటీడీఏ) పీవో ఆర్.కూర్మనాథ్‌ను ధూళిభద్ర, ఎగువశెంబి గ్రామాల సమీపంలో ఒడి శా అధికారులు అడ్డుకున్నారు. దీంతో పీవోకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించే హక్కు మీకెక్కడదని. సుప్రీంకోర్టు స్టేటస్‌కో విధించిన అంశాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. అడ్డంగా వేసిన బారికేడ్లను ఆయనే తోసేసి ముందుకు కదిలారు.
ఆ గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దీంతో ధూళిభద్ర ప్రజలు కాలిబాటన, ఎగువశెంబి ప్రజలు అప్పటికే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా నేరెళ్లవలస పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఒడిశా అధికారులు చల్లగా జారుకున్నారు. విజయనగరం జిల్లా సబ్ కలెక్టర్ విధేహ్ ఖరే, ఎస్పీ రాజకుమారి, తదితరులు నేరెళ్లవలస, ధూళిభద్ర గ్రామాల్లో పర్యటించారు.
చదవండి:
పరిషత్ ఎన్నికలు: పోలింగ్ ప్రశాంతం..
రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment