ముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. మన్యంలో అయితే మరెన్నో రకాల కూరగాయలు లభ్యమవుతాయి. వెదురు నుంచి తీసిన కూరని ఎప్పుడైన వండుకొని తిని ఉంటారా? వినడానికే ఎంతో కొత్తగా ఉన్న మన్యం వాసులు మాత్రం వెదురు నుంచి తీసిన చిగురును కూర వండుకొని తింటారు. దీనిని మన్యం వాసులు వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. కానీ వెదురు కంజి కూర టేస్టే వేరు. వెదురు కొమ్ములు సీజన్ మొదలైయింది. ప్రస్తుతం మన్యంలో మండల కేంద్రాలు, వారపు సంతల్లో వెదురు కంజి అమ్మకాలు హాట్ కేకుల్లా జరుగుతున్నాయి.
అటవీ, కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని సంతల్లో రూ.20 నుంచి రూ.50 లు వరకు వాటాలుగా విక్రయిస్తారు. వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారికి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఒక రకంగా కూర తయారు చేస్తారు. వెదురు కంజిని ఎండబెట్టి మరో విధంగా కూర తయారికీ వినియోగిస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే కూర తయారు చేసుకోవాలి. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజినీ బాగా కడుగుకోవాలని గిరిజనులు చెబుతున్నారు. ఎండబెట్టుకొని ఉంటే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారికి వినియోగించుకోవచ్చు. ఈ వెదురు కంజి కూరను మన్యం వాసులంతా చాలా ఇష్టంగా తింటారు. వెదురు కంజిని వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరును తయారు చేస్తారు.
ఎన్నో ఉపయోగాలు వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు, మూడు సార్లు నీటితో శుభ్రం చేస్తారు. అప్పుడు వెదురు కంజిలో ఉండే చేదుపోతుంది. బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తీసుకుంటారు. దీంతో రక్తం శుద్ధి అవుతుందని, శరీరానికి తక్షణ శక్షి అందుతుందని, జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు నులిపురుగులను నివారిస్తుందని గిరిజనులు చెబుతారు. వెదుర కంజి ద్రావణాన్ని మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా సైతం వినియోగిస్తారు. వెదురు కంజి ఉపయోగాలెన్నో అని గిరిజనులు చెబుతారు.
సంతల్లో జోరుగా అమ్మకాలు
వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ20, రూ.50 చొప్పున అమ్ముతున్నాము. గతంలో మా గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగాను, ఉడకబెట్టి విక్రయిస్తున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి.
– కె.దొణ, పెదతమ్మెంగుల గ్రామం, ముంచంగిపుట్టు మండలం
రుచికరంగా వంటకాలు
వెదురు కొమ్ములతో తయారుచేసిన వంటకాన్ని ఎక్కువగా గర్భిణులకు అందజేస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం వెదురు కంజి కూరల్లో ఉంటుంది. వెదురు కొమ్ముల కూర రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి.అడవీ, కొండ ప్రాంతాల్లో లేత వెదురు నుంచి వెదురు కొమ్ములను సేకరిస్తారు .వారపు సంతలో విక్రయిస్తారు.
– రాధమ్మ, సుజనకోట గ్రామం, ముంచంగిపుట్టు మండలం
Comments
Please login to add a commentAdd a comment