పట్టుచెన్నేరులో ప్రజలతో మాట్లాడుతున్న ఒడిశా నేతలు
సాలూరు: కొటియా పల్లెల్లో ఒడిశా దూకుడు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఆంధ్రాలోనే ఉంటామంటూ తేల్చి చెప్పిన గిరిజనులపై చర్యలకు దిగుతోంది. ఒడిశా ప్రభుత్వం ఈ నెల 18న కొటియా పల్లెల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. తామంతా ఆంధ్రాలోనే ఉంటామంటూ కొందరు గిరిజనులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వారి అప్పీల్‌ను సోమవారం కోర్టు స్వీకరించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని స్థానిక గిరిజన నేతలు, ప్రజలు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఒడిశా ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రా వైపు మొగ్గుచూపుతున్న 12 మంది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ మంగళవారం సాయంత్రం పొట్టంగి తహసీల్దార్ సమన్లు జారీచేశారు. వాటిని తీసుకునేందుకు గిరిజన నాయకులు తిరస్కరించడంతో ఒడిశా పోలీసులు వాగ్వాదానికి దిగారు. అప్పటికీ సమన్లు తీసుకునేందుకు నిరాకరించడంతో స్థానిక నేతలు బుజ్జగించే యత్నాలు ప్రారంభించారు. ఒడిశాలోని పొట్టంగి మాజీ ఎమ్మెల్యే ప్రపుల్ల పంగి, స్థానిక నేతలు కొందరు బుధవారం సాయంత్రం పట్టుచెన్నేరుకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని గిరిజనులతో మధ్యవర్తిత్వం నడిపారు. ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ మావోలు ఇప్పటికే లేఖ విడుదల చేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొటియాపల్లెల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment