మనసున్న ముఖ్యమంత్రి జగన్‌  | Leaders of Tribal Sanghas in Tribal Sankharavam Sabha | Sakshi
Sakshi News home page

మనసున్న ముఖ్యమంత్రి జగన్‌ 

Published Mon, Jan 8 2024 5:18 AM | Last Updated on Mon, Jan 8 2024 7:56 PM

Leaders of Tribal Sanghas in Tribal Sankharavam Sabha - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు అత్యధికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ మాజీ ఎంపీ, ఆచార్య అజ్మీర సీతారాంనాయక్‌ అన్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. ఆదివారం విజయవాడలో ‘గిరిజన శంఖారావం’ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాంనాయక్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు.

ఏపీలో గిరిజనులకు జరుగుతున్నంత సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా అందడం లేదని చెప్పారు. అందుకే ఏపీలోని గిరిజనులు జగన్‌ను దేవుడిగా అభిమానిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పపూలు ఏరుకుని బతికే కుటుంబానికి చెందిన తాను ఉమ్మడి ఏపీలో మొదటి పీహెచ్‌డీ చేసిన గిరిజన వ్యక్తినని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతంగా ఎదుగుతామన్నారు.

రాష్ట్రంలో గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత
ఏపీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ రాష్ట్రంలోని గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను మరింతగా పెంచాలనే తపనతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల మాట వినే ప్రభుత్వం ఉందని, దాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 

గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం
గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం జగన్‌ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీలుగా గిరిజనులకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను సీఎం జగన్‌ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు.

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకొని.. మరింతగా అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు. జీపీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జి.మల్లిఖార్జున నాయక్, జీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజునాయక్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే గిరిజన తండాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం.. తదితర సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో పెత్తందారులతో జరుగుతున్న యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా, అగ్రవర్ణ పేదల నాయకుడైన సీఎం జగన్‌ను గెలిపించుకుందామని కోరారు.

గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్‌ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ సభ్యులు కె.రామలక్ష్మి, జె.లిల్లీ, నెల్లూరు నగర మేయర్‌ పొట్టూరి స్రవంతి, కదిరి రూరల్‌ జెడ్పీటీసీ కృష్ణ నాయక్, పలు కార్పొరేషన్ల డైరెక్లర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ బంజార కళాకారుడు బిక్షు నాయక్‌ బృందం ప్రదర్శించిన గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement