సిర్పూర్(టి), న్యూస్‌లైన్ : సిర్పూర్(టి) మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న దుర్గం దేవిప్రసాద్(12), దుర్గం విద్యాసాగర్(13) నాగమ్మ చెరువు చెక్ డ్యాంలో పడి ఆదివారం సాయంత్రం మృతిచెందారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన దేవిప్రసాద్, విద్యాసాగర్ ఏడో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవుకావడంతో సరదాగా స్నానం చేయడానికి ఇద్దరు కలిసి పాఠశాల వెనుకాల ఉన్న చెక్‌డ్యాంకు స్నానానికి వెళ్లారు. దేవిప్రసాద్, విద్యాసాగర్ చెక్‌డ్యాం ఒడ్డున స్నానం చేస్తూ లోతైన ప్రాంతానికి వెళ్లి మునిగారు. బహిర్భూమికని వెళ్లిన యశ్వంత్ వీరు మునిగిపోవడాన్ని గమనించి తోటి విద్యార్థులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే జీవన్, ప్రవీణ్, సంతోష్ హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని చెక్‌డ్యాంలో గాలించి విద్యార్థులను బయటికి తీశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మిన్నంటిన రోదనలు
విద్యార్థులు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని మృతదేహాలపై పడి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇద్దరు విద్యార్థులు కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన వారు కావడంతో విద్యార్థుల తల్లితండ్రులు ఆదివారం మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి విద్యార్థులను కలిశారు. భోజనం చేసిన అనంతరం యోగక్షేమాలు కనుక్కుని ఇంటికి బయలుదేరారు. తల్లిదండ్రులు ఇంటికి చేరుకునేలోపే వీరి కొడుకులు చనిపోయారనే వార్త తెలిసింది. వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. రాము-శ్యామలకు ఒక కూతురితోపాటు దేవిప్రసాద్ ఒక్కడే కుమారుడు. వీరు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో విషాదంలో మునిగారు. భగవాన్- పుష్పలకు ముగ్గురు కూతుళ్లు, విద్యాసాగర్ ఒక్కడే కుమారుడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులు చదివి తమకు అన్నివిధాల అండగా ఉంటాడనుకుంటే అర్ధాంతరంగా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాల వద్ద తల్లితండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు రోదించిన తీరు కన్నీరు పెట్టించింది.
మృతదేహాలతో రోడ్డుపై ధర్నా
సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై విద్యార్థుల శవాలతో పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్‌కు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అడీషనల్ ఎస్సై సుధాకర్ విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్‌లు స్థానికంగా ఉండక పోవడంతో విద్యార్థులకు ఎలాంటి అడ్డం లేకుండా ఉందని, దీంతోనే విద్యార్థులు పాఠశాల పక్కన ఉన్న వాగులో, సమీపంలో ఉన్న చెక్‌డ్యాంకు వెళ్లున్నారని తల్లిదండ్రులు వాపోయారు.
ఇంటికి చేరుకోక ముందే..
Published Mon, Nov 25 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement