ప్రాణాలు తీస్తున్న ఆర్‌ఎంపీలు?! అక్కడ అసలేం జరుగుతోంది? | RMP Doctor Treatment Leads to End of kids Life | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న ఆర్‌ఎంపీలు?! అక్కడ అసలేం జరుగుతోంది?

Published Mon, Oct 30 2023 9:40 AM | Last Updated on Mon, Oct 30 2023 10:01 AM

RMP Doctor Treatment Leads to End of kids Life  - Sakshi

సిర్పూర్‌(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బూరం చెన్నమల్లు యాదవ్‌ స్వల్ప జ్వరంతో ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌తో కేవలం ఐదు గంటల్లో ప్రాణాలు కోల్పోయాడు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు సైతం ఇలాగే మృతి చెందాడు. తాజాగా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన వివాహిత దన్నూరి పుష్పలత ప్రాణాలు కోలో్పయింది. ఆమె చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చెందిన గోంగ్లె బండు– చైతన్య దంపతుల కుమార్తె ఆద్యశ్రీ (4) ఓ ఆర్‌ఎంపీ నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

చింతలమానెపల్లి(సిర్పూర్‌): గల్లీగల్లీకి వెలుస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిధి దాటి వైద్యం చేస్తు న్న కొందరు ఆర్‌ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్‌ఎంపీలు ఉన్నట్లుగా ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘాల లెక్కలు చెబుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేని కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు వైద్యపరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతంగా మందులు రాయడం, ఇంజక్షన్‌లు వేయడం చేస్తున్నారు. కొద్దినెలల పాటు ఆర్‌ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం గ్రామాల్లో సొంతంగా క్లినిక్‌లు తెరుస్తున్నారు.

ధనార్జనే ధ్యేయం..
గతంలో ప్రభుత్వాలు తెచ్చిన నిబంధనలను ఆసరాగా చేసుకుని కొందరు ఆర్‌ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా క్లినిక్‌ల్లో వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స అందించాల్సి వీరు  ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో రోగులకు వైద్యం అందిస్తున్నారు. భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల క్లినిక్, మందుల దుకాణం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకేగదిలో నిర్వహిస్తుండడం గమనార్హం. పరిమితులు దాటి చేస్తున్న వైద్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ల్లోనూ ఆర్‌ఎంపీ క్లినిక్‌లు ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

ప్రాణాలు పోతున్నా చర్యలేవి..?
ఆర్‌ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ ఓ వైపు ప్రాణా లు పోతున్నా పట్టించుకోరా..?’ అంటూ ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కిల్లింగ్‌ ఇంజక్షన్స్‌..
ఇటీవల బాధితులు మృతి చెందిన ఘటనలు ఆర్‌ఎంపీలు అందించిన వైద్యంతోనే జరిగినట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న వారికి ఇంజక్షన్‌ ఇచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వాంతులు చేసుకోవడం, చలి పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోగా రోగులు నేరుగా కోమాలోకి వెళ్తున్నారు. ఆర్‌ఎంపీలు చేస్తున్న వైద్యం, వారు ఇస్తున్న ‘కిల్లింగ్‌ ఇంజక్షన్‌’ ఏంటన్నది వైద్యాధికారులు తేల్చాల్సి ఉంది.

రోగుల ప్రాణాలకు ముప్పు
వైద్యం అనేది రోగిని అన్నిరకాలుగా పరీక్షించి అందించాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో వైద్యం అందించకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారి వద్దే వైద్యం తీసుకోవాలి. బాధితుల పరిస్థితిని తెలుసుకునే అవకాశం కేవలం నిపుణులకు మాత్రమే ఉంటుంది.
– అరుణకొండ రవికుమార్, ఎండీ జనరల్‌ ఫిజీషియన్, మంచిర్యాల

ఎక్కువ డోస్‌ మందులతోనే..
రోగుల జ్వరం తీవ్రతతతోపాటు ప్లేట్‌లెట్స్‌ను కూడా వైద్యులు గమనించాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్‌ తక్కువగా ఉంటే ఫ్లూయిడ్స్, నరాల ద్వారా ఇచ్చే మందులను పరిశీలనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ డోస్‌ మందులను తీవ్రస్థాయిలో వినియోగించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. 
– సందీప్‌ జాదవ్, ఆదిలాబాద్‌ రిమ్స్‌ వైద్యులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement