సిర్పూర్‌ మిల్లు.. మళ్లీ మొదలు | Sirpur Paper Mill To Be Reopened | Sakshi
Sakshi News home page

స్వాధీనానికి ముందుకొచ్చిన ‘జేకే పేపర్‌’

Published Fri, Jul 20 2018 1:51 AM | Last Updated on Fri, Jul 20 2018 8:25 AM

Sirpur Paper Mill To Be Reopened - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఆసిఫాబాద్ ‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లుకు మంచిరోజులొచ్చాయి. నాలుగేళ్ల కిందట మూతబడిన ఆ మిల్లు మళ్లీ తెరుచుకోనుంది. మిల్లు స్వాధీనానికి ప్రముఖ పేపర్‌ కంపెనీ జేకే పేపర్‌ లిమిటెడ్‌ సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యుడు బిక్కి రవీంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ‘స్వాధీన ప్రక్రియ కొలిక్కి రావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రాయితీ నిర్ణయాలు కీలకపాత్ర పోషించాయి.

పెద్ద సంఖ్యలో రాయితీలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జేకే పేపర్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది’ అని ఉత్తర్వుల్లో రవీంద్రబాబు ప్రస్తావించారు. మిల్లు పునఃప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులు మారుతాయని చెప్పారు. ట్రిబ్యునల్‌ తీర్పు ఇవ్వగానే కాగజ్‌నగర్‌లో కార్మికులు ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిల్లు గేటు ఎదుట బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.  

నిజాం ఉస్మాన్‌ కాలంలో..
ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో 1936లో అప్పటి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ కాలంలో సిర్పూర్‌ పేపర్‌ మిల్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటైంది. 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. మొదట కొత్తపేట్‌గా ఉన్న ఆ ఊరి పేరు మిల్లు ఏర్పాటుతో కాగజ్‌నగర్‌గా మారింది. వేలాది మందికి ఆ మిల్లు జీవనాధారమైంది. ఆ తరువాత మిల్లు బిర్లా కుటుంబం చేతికి, అటు నుంచి పొద్దార్‌ చేతుల్లోకి వెళ్లింది. అయితే ముడిసరుకు ధరలు పెరగడం, తగినంత విద్యుత్‌ సరఫరా లేకపోవడం, నిర్వహణ లోపాలతో 2014లో మిల్లు మూతబడింది. ఆనాటికి మిల్లును ఆర్‌.కె.పొద్దార్‌ నిర్వహిస్తున్నారు.  

ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌
మూతబడే నాటికి కంపెనీ యాజమాన్యం వద్ద 49.91 శాతం, ప్రజల వద్ద 50.09 శాతం ఈక్విటీ వాటాలున్నాయి. రుణదాతలతో పాటు కార్మికులు, ఉద్యోగుల వేతనాలు తదితరాలకు రూ.673.59 కోట్లను చెల్లించాల్సి ఉంది. 2004, 2008 మధ్య మిల్లు యాజమాన్యం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో లీడ్‌ బ్యాంక్‌ ఐడీబీఐ 2016 అక్టోబర్‌ 12న మిల్లు ఆస్తులు స్వాధీనం చేసుకుంది. మిల్లు నుంచి తమకు రూ.51.86 లక్షల రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని కంపెనీ చెల్లించే పరిస్థితిలో లేనందున దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ రమా రోడ్‌లైన్స్, మరికొందరు ఎన్‌సీఎల్‌టీలో గతేడాది పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌.. గతేడాది దివాలా పరిష్కార నిపుణుడిని నియమించింది. పేపర్‌ మిల్లు భూములు, భవనాలు, నివాస గృహాలు, ప్లాంటు, యంత్రాల విలువను రూ.338.52 కోట్లుగా చేర్చారు.  

ప్రణాళికకు 80.66 శాతం ఓట్లు
మిల్లు స్వాధీనానికి గుజరాత్‌కు చెందిన జేకే పేపర్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. రుణ పరిష్కార ప్రణాళిక సమర్పించింది. ఆ ప్రణాళికకు ఆమోదముద్ర వేసేందుకు రుణదాతలైన బ్యాంకర్లు ఓటింగ్‌ నిర్వహించగా ఆమోదిస్తూ 80.66 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో జేకే ప్రణాళికను ఆమోదిస్తూ రుణదాతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే మిల్లును స్వాధీనం చేసుకునేందుకు తమకు కొన్ని రాయితీలివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జేకే పేపర్‌ లిమిటెడ్‌ కోరింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రాయితీలిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇక దివాలా పరిష్కార నిపుణుడు తన న్యాయవాది వీకే సాజిత్‌ ద్వారా మొత్తం వివరాలతో కూడిన నివేదికను ఎన్‌సీఎల్‌టీకి సమర్పించారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదం తెలపడం, ఐబీసీ సెక్షన్‌ 29ఎ ప్రకారం జేకే పేపర్‌ లిమిటెడ్‌కు అనర్హత వర్తించకపోవడంతో ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదముద్ర వేసింది.  

ప్రభుత్వ రాయితీలివే..
పదేళ్ల పాటు ఎస్‌జీఎస్‌టీ, 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు. రూ.50 కోట్ల లోపు 20 శాతం పెట్టుబడి రాయితీ. పదేళ్ల పాటు డీబార్కడ్‌ యూక, సుబాబుల్‌ సరఫరాపై రాయితీ. బొగ్గు రిజర్వు చేయడంతో పాటు పదేళ్ల పాటు సరఫరా చేస్తూ టన్నుకు రూ. 1,000 రాయితీ. కొత్త పెట్టుబడులపై 5 ఏళ్లు 2 శాతం వడ్డీ రాయితీ. 2 నెలల్లో అన్ని లైసెన్సులకు అనుమతులు. పదేళ్లు విద్యుత్‌ చార్జీల మినహాయింపు. కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల బకాయిల చెల్లింపును సర్కారే తీసుకుంది.

కేటీఆర్‌కు కృతజ్ఞతలు
మిల్లు పునరుద్ధరణకు కృషి చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నేతలు మంత్రి జోగు రామన్న, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ.. మిల్లు పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కొన్ని కంపెనీలతో చర్చలు జరిపామని తెలిపారు. వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే సిర్పూర్‌ పేపర్‌ మిల్లు మళ్లీ ప్రారంభమవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement