* తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
* జల దిగ్బంధంలో గ్రామాలు.. పలుచోట్ల రాకపోకలు బంద్
* ఉప్పొంగుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
* ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం
* నేడు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల అత్యంత భారీ వర్షాలతో జన జీవనం అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.. ఇళ్లలోకి వరద నీరు చేరింది.. రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.. రామగుండం ఓపెన్‌కాస్ట్‌ల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఈ సీజన్‌లోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌లో ఏకంగా 23 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా మంథనిలో 19, మంచిర్యాలలో 16, రామగుండంలో 15, చెన్నూర్, కాళేశ్వరం, ఆసిఫాబాద్‌లో 13, పేరూర్‌లో 12, వెంకటాపురం, భూపాలపల్లిలలో 11, గోల్కొండ, గోవిందరావుపేట, వెంకటాపూర్‌లలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అయితే సోమవారం కూడా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు.
పొంగి ప్రవహిస్తున్న వాగులు..
కరీంనగర్ జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు సగటున 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంథనిలో 19, రామగుండంలో 15.2 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మంథని, పెద్దపల్లి, జగిత్యాల డివిజన్లలో చెరువులు, కుంటలన్నీ నిండిపోయాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంథనిలో ఇళ్లలోకి నీరు చేరింది. బొక్కలవాగు, బొగ్గులవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామగుండం రీజియన్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల్లో వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీ-3లో 250 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్, డ్రిల్ యంత్రం నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు నిల్వలు అడుగంటగా.. వర్షాల కారణంగా బొగ్గు అందకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించారు.
రాకపోకలు బంద్..
భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదివారం దాదాపు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల చెరువులు, కుంటలు తెగిపోయాయి. భారీగా వరద నీరు వచ్చిచేరడంతో క డెం, కొమురంభీం ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. తిర్యాణి మండలం ఇరుకపల్లి గ్రామానికి చెందిన మడావి హన్మంతరావు వాగులో గల్లంతయ్యారు. సిర్పూర్ నియోజకవర్గంలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జలదిగ్బంధంలో గ్రామాలు..
రెండు రోజులుగా వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ ఏరియాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆదివారం జిల్లాలో 3.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో గోదావరి ఉరకలెత్తుతోంది. ఇక్కడ నీటిమట్టం 10 మీటర్లను దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏటూరునాగారం మండలంలోని అటవీ గ్రామాలు ఐలాపురం, ముళ్లకట్ట, రాంపూర్, కోయగూడెం, ఎల్లాపూరం, రాంనగర్, గణపురం, చెల్పాక, వీరాపురం, బల్లాజీబంధం గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పరకాల శివారు చలివాగు, ఘనపురం మోరంచవాగు, నర్సంపేట అటవీ ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి.
ఏజెన్సీలో కుండపోత..
ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వాజేడులో అత్యధికంగా 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో 11, చర్లలో, గుండాలలో 5, కారేపల్లి, టేకులపల్లి, పినపాక, బయ్యారంలో 3, ఇల్లెందు, చండ్రుగొండ, అశ్వాపురం, మణుగూరులలో 2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రికి గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (08742-231600)ను నెలకొల్పారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో.. గోదావరి ఉప నదులు పొంగి వరద తీవ్రత పెరుగుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మెదక్, పాలమూరు, నిజామాబాద్‌లో మోస్తరు
మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్‌చెరు, జోగిపేట, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో వర్షాలతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి, రామచంద్రాపురం, మెదక్, రామాయంపేటల్లో ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైంది.
ఇక ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 0.5 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూర్ మండలంలో 3 సెంటీమీటర్లు, మాగనూర్, వడ్డేపల్లి, మక్తల్, మానవపాడుల్లో 2, వనపర్తి, నర్వ, దేవరకద్ర, పెద్దమందడిల్లో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా సగటున ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ, డిచ్‌పల్లి, భీంగల్, సిరికొండ ప్రాంతాల్లో అధికంగా వర్షం కురిసింది.
ఇంకా 33 శాతం లోటే!
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత పదిహేను రోజుల్లో రెండు దఫాలుగా భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుత సీజన్‌లోనే ఈ వర్షాలు అత్యంత కీలకమైనవి. అయినా జూన్, జూలై నెలల్లో వర్షాలు కురవకపోవడంతో.. ఏర్పడిన లోటు ఇంకా తగ్గలేదు. జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 7 నాటికి తెలంగాణలో సాధారణంగా సగటున 63.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా... 42.4 సెంటీమీటర్లు కురిసింది. అంటే ఇంకా 33 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. జిల్లాల వారీగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 51 శాతం, మెదక్ జిల్లాలో 50 శాతం, నల్లగొండ జిల్లాలో 47 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది.
ముంచెత్తిన వాన
Published Mon, Sep 8 2014 1:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement