కరకట్ట పొడవు పెంచాలని ధర్నా చేస్తున్న భద్రాచలంలోని సుభాష్‌నగర్ కాలనీ వాసులు..
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాలతో వారం పాటు మహోగ్ర రూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఎగువన శ్రీరాంసాగర్‌లోకి వరద బాగా తగ్గిపోగా.. దిగువన భద్రాచలం వద్ద గడగడా వణికించి మెల్లగా వెనక్కి తగ్గుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీరాంసాగర్‌కు వరద 16 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఎల్లంపల్లికి 1,08,940 క్యూసెక్కులు వస్తోంది. అయితే ప్రాణహిత, కడెం, ఇంద్రావతి ఉపనదులు, ఏజెన్సీ వాగుల్లో ప్రవాహాలు ఇంకా ఉండటంతో.. లక్ష్మిబ్యారేజీ వద్ద 10,94,150 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ వద్ద 13,16,500 క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 20,60,131 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీల వద్ద వచ్చింది వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు.
తగ్గినా.. గణనీయంగానే..
భారీగా పోటెత్తిన వరదతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు 71 అడుగుల మట్టంతో 24,29,246 లక్షల క్యూసెక్కుల వరదరాగా.. శని వారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి 24,43,684 క్యూసెక్కులతో 71.3 అడుగుల గరిష్ట స్థాయి వరద నమోదైంది. ఆ తర్వాత క్రమంగా ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడిన ప్రజలు క్రమంగా తేరుకుంటున్నారు. అయితే లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయామంటూ భద్రాచలంలోని లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు.
నాటు పడవలో వెళ్తూ తమ షాపులను చూసుకుంటున్న స్థానికులు
53 అడుగులకు తగ్గితేనే..
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకన్నా తగ్గితేనే మూడో ప్రమాద హెచ్చరికకు ఉపసంహరిస్తారు. అప్పటివరకు లోతట్టు ప్రాంతాలు వరద ముప్పులో ఉన్నట్టే లెక్క. చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో మూడు రోజులుగా విద్యుత్ నిలిచిపోగా.. గోదావరి వరద తగ్గేవరకు పునరుద్ధరించే పరిస్థితి కనిపించడం లేదు. అశ్వాపురం మండలం కమ్మరిగూడెంలోని మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్ వరద మునిగే ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 1,730 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల పంచాయతీ నుంచి ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గే వరకు ప్రజలకు మంచినీటి కష్టాలు కొనసాగనున్నాయి.
పారిశుధ్యంపై దృష్టిపెట్టిన అధికారులు
గోదావరి నీరు వెనక్కి మళ్లిన తర్వాత ముంపు ప్రాంతాల్లో భారీగా బురద, చెత్తా చెదారం నిండిపోయి ఉంటుంది. దీంతో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్, వరద సహాయ కార్యక్రమాల ప్రత్యేక అధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. అంతకంటే ముందు ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలపై మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు. నీటిలో చిక్కుకున్న గ్రామాలు, కాలనీలు బయటపడితే గానీ ఆస్తి నష్టం ఏ స్థాయిలో జరిగిందనేది తెలియదని అధికారులు అంటున్నారు. సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొంటున్నారు.
వందేళ్లలో రెండో అతిపెద్ద వరద
గత వందేళ్లలో గోదావరికి వచ్చిన అతిపెద్ద వరదల్లో తాజా ప్రవాహం రెండో అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. 1986 ఆగస్టు 15న భద్రాచలం వద్ద 75.6 అడుగుల వరకు వచ్చిన ప్రవాహం అతిపెద్ద వరదగా రికార్డుల్లో నమోదైంది. కాగా భద్రాచలం వద్ద శనివారం రాత్రి 9 గంటల సమయానికి వరద 22,41,144 క్యూసెక్కులకు, నీటిమట్టం 67.7 అడుగులకు తగ్గింది.
గోదారమ్మా శాంతించు..
‘గోదారమ్మా.. శాంతించు.. ప్రజలను చల్లంగా చూడు’అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శనివారం భద్రాచలంలో పూజలు చేశారు. సీతారామ చంద్రస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోదావరికి పసుపు, కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. సస్యశ్యామల మాతగా పేరొందిన గోదావరి ఒడ్డున అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా కరుణించాలని కోరుకున్నట్టు మంత్రి తెలిపారు.
– భద్రాచలం
Comments
Please login to add a commentAdd a comment