దొరికిన పులి.. అయినా మరో గిలి! | Forest Officers Catch Man Eating Tiger In Tamilnadu | Sakshi
Sakshi News home page

దొరికిన పులి.. అయినా మరో గిలి!

Published Sun, Oct 17 2021 5:14 AM | Last Updated on Sun, Oct 17 2021 5:27 AM

Forest Officers Catch Man Eating Tiger In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): నీలగిరుల్లో అటవీ అధికారులు, వేటగాళ్లను 21 రోజుల పాటుగా ముప్పుతిప్పలు పెట్టిన పులి ఎట్టకేలకు దొరికింది. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పట్టుకున్న ఈ పులికి మైసూర్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే సత్యమంగళం అడవుల్లో మరో పులి పశువుల మీద దాడి చేయడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. నీలగిరి జిల్లా కూడలూరు పరిసరాల్లో ఓ పులి జనాన్ని రెండు నెలలుగా వణికించిన  విషయం తెలిసిందే.

ఇప్పటికే నలుగుర్ని చంపింది. పదుల సంఖ్యలో పశువుల్ని హతమార్చింది. ఈ పులిని పట్టుకునేందుకు గత నెలఖారులో టీ–23 పేరిట ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. 150 మందితో కూడిన బృందం వేటకు దిగింది. ఈ పులిని కాల్చి చంపేందుకు సైతం అనుమతులు పొందారు. చివరకు కోర్టు ఆదేశాలతో వెనక్కు తీసుకున్నారు. ఈ పులి ఏ మార్గంలో వస్తున్నదో, జనం మీద దాడి చేసి ఎలా తప్పించుకుంటున్నదో అంతు చిక్క లేదు. నిఘా నేత్రాలు, డ్రోన్‌కెమెరాల సాయంతో గాలింపు చేపట్టారు. 21 రోజుల పాటుగా నిర్విరామంగా సాగిన ఈ పులి వేటలో శుక్రవారం ముందడుగు వేశారు. 

మైసూర్‌లో చికిత్స..
మసన కుడి – తెప్పకాడు పరిసరాల్లో ఈ పులి సంచరిస్తుండడం నిఘా నేత్రాలకు చిక్కాయి. దీంతో ప్రత్యేక బృందాలు అటు వైపుగా కదిలాయి. చేతుల్లో మత్తు ఇంజెక్షన్‌తో కూడిన తుపాకులతో వేట సాగించారు. పొదళ్లల్లో నక్కి ఉన్న పులి మీద మత్తు ఇంజెక్షన్‌ ప్రయోగించారు. కొద్దిదూరం పరుగులు తీసిన ఆ పులి సొమ్మ సిల్లింది. వెను వెంటనే మరింతగా పులికి మత్తును ఇచ్చి, బోనులో బంధించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ మంత్రి రామచంద్రన్, కార్యదర్శి సుప్రియా సాహు అక్కడికి చేరుకుని ఆ బృందాన్ని అభినందించారు. అయితే, మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చే సమయంలో మణిగండన్‌ అనే అటవీ సిబ్బంది గాయపడగా, అతడిని ఆస్పత్రికి తరలించారు.

ఈ పులిని మైసూర్‌లోని వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ తీవ్రచికిత్స అందిస్తున్నారు. ఈ పులి చిక్కిన ఆనందంలో ఉన్న అధికారులకు సత్యమంగళంలో మరో పులి పంజా విసరడం కలవరాన్ని రేపింది. పశువుల మీద ఈ పులి దాడి చేయడంతో సత్యమంగళం పరిసర వాసుల్లో కలవరం బయలుదేరింది. ఈ పులిని పట్టుకునేందుకు మరో ఆపరేషన్‌ తప్పదేమో అని అటవీ అధికారులు భావిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement