వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రైతు
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన
లింగాల/రాజవొమ్మంగి/అడ్డతీగల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో పులి, పులి పిల్లలు సంచరిస్తున్న దృశ్యాలను రైతులు చంద్రశేఖర్, తన చెల్లెలు తమ సెల్‌ఫోన్‌ల్లో సోమవారం వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తాతిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని పులులు సంచరిస్తోన్న ప్రదేశాలను తనిఖీలు చేశారు. అయితే సోమవారం రాత్రి వర్షం కురవడంవల్ల వాటి జాడలు కనిపించలేదు.
గ్రామస్తులకు తహశీల్దార్ ఈశ్వరయ్య తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు పొలం పనులు పూర్తి చేసుకుని రావాలని రైతులకు, చీకటి పడేలోపు ఇళ్లకు చేరుకోవాలని గొర్రెల కాపరులకు సూచించారు. పులుల సంచారంపై నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్‌వో శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో ఈ పులులు సంచరిస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి సంచారాన్ని పసిగట్టి వాటిని అక్కడ నుంచి తరిమివేసేలా చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో దివాకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డీఆర్‌వో శ్రీనివాసులు, ఎఫ్‌బీవోలు మహబూబ్ బాషా, గోపాల్ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.
అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి నుంచి గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్‌రోడ్/అటవీప్రాంతంలో పులి సంచారంపై మంగళవారం సాక్షిలో ‘అమ్మో పులి’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా రాజవొమ్మంగి అటవీక్షేత్రాధికారి జి.ఉషారాణి ఘటనాస్థలికి వెళ్లి పులి పాదముద్రలు పరిశీలించారు. పాద ముద్ర 14 సెం.మీ. పొడవు, వెడల్పు ఉన్నట్లు రికార్డు చేశారు.
లోతట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్లి సెలయేరు వద్ద పులి సంచరించిన చోట పరిశీలించగా అక్కడ పులి అడుగు జాడలు కనిపించడంతో ఫోటోలు తీశారు. ఇది పులా? చిరుత పులా? అనే సమాచారాన్ని అధికారులతో సంప్రదించి వెల్లడిస్తామన్నారు.
పులి దాడిలో మేకలు చనిపోయిన ఘటనపై విచారణ కోసం మేకల కాపరి ఉండే అడ్డతీగల అటవీ సబ్ డివిజన్ పాపంపేట సెక్షన్ పరిధి కినపర్తికి అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది వెళ్లారు. పులిని చూసిన మేకల కాపర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేకలపై దాడి సమయంలో చెట్లెక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment