
ఆరిలోవ(విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం(ఏఆర్‌సీ)లో ఆడ పులి మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జూ పార్కు సమీపంలో ఉన్న ఏఆర్‌సీలో 23 సంవత్సరాల వయసు కలిగిన కుమారి అనే ఆడపులి వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురై ఈ నెల 24వ తేదీ రాత్రి మృతి చెందినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ఫేమస్ సర్కస్ కంపెనీకి చెందిన కుమారిని 2007లో ఏఆర్‌సీకి తీసుకొచ్చారని, కుమారి మృతితో ఏఆర్‌సీలో ప్రస్తుతం పులులు లేవని పేర్కొన్నారు.
కాగా, కుమారి మృతి చెందిన రెండు రోజులు వరకు విషయం బయటపడకుండా జూ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. అదే రోజు ఉదయం జూలో జానకి అనే 22 ఏళ్ల ఆడ పెద్ద పులి మరణించిన విషయం బయటకు వెల్లడించిన జూ అధికారులు ఏఆర్‌సీలో మృతి చెందిన కుమారి విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు