పులికే ప్రాణ గండమా? ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది | Life threat for tigers from hunters | Sakshi
Sakshi News home page

పులికే ప్రాణ గండమా? ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది

Published Fri, Apr 7 2023 9:30 AM | Last Updated on Sat, Apr 8 2023 3:55 PM

- - Sakshi

పాపం పులి

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవిలో వేట పూర్తిగా ఆగితేనే జాతీయ జంతువు పులికి భద్రత లభిస్తుంది. ఈ ఏడాది కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలో రెండు పు లుల మరణాలు వెలుగులోకి రావడం ముప్పును తె లియజేస్తోంది. నెన్నెల మండలం కుశ్నపల్లి రేంజ్‌లో పులి అవశేషాలు బయటపడడం తెలిసిందే. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర పరిధి జివితి తాలూకాలో కు మురంభీం జిల్లాలో సంచరించిన ఓ పులిని హతమార్చి చర్మం విక్రయిస్తుండగా అక్కడి అటవీ అధికారులు పట్టుకున్నారు.

టైగర్ మిస్సింగ్.?

వరుస ఘటనలతో కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో పులుల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పులులు చనిపోయిన నెలల తర్వాత వాటి అవశేషా లు విక్రయిస్తున్న క్రమంలోనే ఈ ఉదంతాలు బయటకు వస్తున్నాయి. పులి ట్రాకింగ్‌ వ్యవస్థ స్పష్టత లేక ఏ పులి ఎక్కడ సంచరిస్తుందో తెలియక కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి జాడ లేకుండా పోయిన పులులు ఉన్నాయి. చాలావరకు మహారాష్ట్ర వెళ్లిపోయాయని చెబుతున్నప్పటికీ వాస్తవానికి అవి ఎక్కడున్నాయో స్పష్టత లేదు.

కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్నారు

అడవిలో వన్యప్రాణుల వేట కోసం అమర్చుతున్న విద్యుత్‌ తీగలతోనూ పులులకు ముప్పు వాటిల్లుతోంది. గతంలో అటవీ ప్రాంతాల వరకు విద్యుత్‌ సదుపాయం ఉండకపోవడంతో ఉరిలు మాత్రమే వేసేవాళ్లు. అడవి పందులు, దుప్పులు, ఏదులు, మెకం వంటి జంతువులను వేటాడేందుకు ఏకంగా 32కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ లైన్ల నుంచి దొంగచాటుగా అడవి లోనికి ప్రసారం చేస్తూ వాటి ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికీ అటవీ సమీప ప్రాంతాల్లో యథేచ్ఛగా వేట కొనసాగుతోంది.

జాతీయ జంతువుకు గండం

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌, తడోబా, అంధేరి పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంతతి పెరిగి కవ్వాల్‌లోకి అడుగు పెడుతున్నాయి. ఆహారం, ఆవాసం, తోడు కోసం ఇటు వైపు వస్తున్నాయి. ఇలా వచ్చిపోయే వలస పులులతోపాటు కవ్వాల్‌ పరిధిలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న వాటికి ముప్పు పొంచి ఉంది. అటవీ సమీప ప్రాంతాల ప్రజలకు జాతీయ జంతువుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోపాటు పులులు వస్తే పాటించాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు వివరించడం లేదు.

భద్రత పేరుతో గోప్యత

ఒక్కోసారి పులి వచ్చిందని చెప్పినా అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనూ సమస్యలు వస్తున్నాయి. గతంలో ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల పరిధిలో పులి సంచరిస్తోందని అక్కడి అధికారులకు చెబితే ఈ ప్రాంతంలో పులి లేదని కొట్టిపారేశారు. రెండ్రోజులకే అక్కడ ఓ రైతుపై దాడి చేసి ప్రాణాలు తీసింది. పులి భద్రత పేరుతో గోప్యత పాటించి అసలుకే మోసం తెస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక రాత్రి వేళ కరెంటు సరఫరా, తనిఖీలు, గస్తీ, యానిమల్‌ ట్రాకర్స్‌ ఉన్నప్పటికీ పులికి ప్రాణగండం తప్పడం లేదు.

వేసవిలోనూ వేటగాళ్ల ముప్పు

వేసవిలో వన్యప్రాణులు అడవిలో నుంచి వేడిని తట్టుకునేందుకు, నీరు, ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో వేటగాళ్లు షికారీ చేస్తూ అటవీ జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. వానాకా లంలో పత్తి పంటను కాపాడుకునేందుకు అడవి పందుల నియంత్రణకు విద్యుత్‌ తీగలతో కంచెలు వేస్తుంటారు. ఆ సమయంలో ఏ జంతువు తగిలినా ప్రాణాలు కోల్పోతాయి. వేసవిలో నీటికుంటలు, ఒర్రెలు, లోయలు, వెదురు చెట్ల చల్లదనం కోసం వచ్చే క్రమంలో వేటగాళ్లు ఉచ్చులు వేసి ప్రాణాలు తీస్తున్నారు. దీనిపై పకడ్బందీగా ప్రణాళిక వేసి అమలు చేస్తే గానీ అటవీ జంతువులకు రక్షణ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement