ఎమ్మెల్సీ బరిలో ‘వెరబెల్లి’!
● పోటీకి సిద్ధమైన బీజేపీ నేత రఘునాథ్‌రావు ● పార్టీ మద్దతు ఉందంటూ విస్తృత పర్యటన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు సిద్ధమయ్యారు. ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేసేందుకు సానుకూల సంకేతాలు రావడంతో ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల నియోజకవర్గ పరిధి విస్తృతంగా ఉండడంతో ఆ పార్టీ నుంచి అనేకమంది సీనియర్లు తమ ఆసక్తిని బయటపెడుతున్నారు. రఘునాథ్‌రావుకే పార్టీ మద్దతు దక్కే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంతోపాటు పనిలో పనిగా ప్రచారం సైతం మొదలు పెట్టారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు, విద్యావంతులు, పట్టభద్రులను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా బరిలో ఉంటానని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన పోటీలో ఉంటే ఉమ్మడి జిల్లా నుంచి ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది.
పార్టీ మద్దతు దొరికితేనే..
ఉన్నత విద్యావంతుడైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్, అమెరికాలో ఎంబీఏ చేశారు. సాప్ట్‌వేర్ రంగ వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యారు. సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేపీ తరఫున మంచిర్యాల శాసనసభ స్థానానికి పోటీ చేసి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2023లో రెండో స్థానం నిలిచి ఆయన స్థానాన్ని మెరుగు పరుచుకున్నారు. తాజాగా పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. పెద్దపల్లి పరిధిలోనూ ఓ ప్రజాప్రతినిధిని పార్టీ తరఫున గెలిపించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న నాయకులను ఎమ్మెల్సీగా పోటీ చేయించే ఆసక్తి చూపకపోతే రఘునాథ్‌కు అవకాశం ఉంది. ఇక కేంద్ర, రాష్ట్ర స్థాయి, ఆర్‌ఎస్‌ఎస్, పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్న వెరబెల్లికి ప్రచారం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన కచ్చితంగా బరిలో ఉంటారనే సంకేతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై వెరబెల్లిని ‘సాక్షి’ సంప్రదించగా.. పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఉన్నత విద్యావంతుడిగా విద్యార్థి, యువత, నిరుద్యోగ సమస్యలు తనకు తెలుసని, పార్టీ మద్దతుతో గెలుస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment