నాగాయలంక అభయారణ్య ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కిన బావురు పిల్లి
గుంటూరు డెస్క్: దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి అంతరించి పోతున్న జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రెండువేలలోపే ఈ జాతి పిల్లులు ఉన్నట్టు అంచనా. కృష్ణా, బాపట్ల అభయారణ్యం ప్రాంతంలో వీటిజాడ గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని మనుషులు వేటాడకుండా తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
11 దేశాల్లో మాత్రమే..
చేపలను వేటాడి జీవించే ఈ అరుదైన జాతి పిల్లిని ప్రాంతాలను బట్టి బావురుపిల్లి, పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని పిలుస్తారు. దీని శాసీ్త్రయ నామం రౖపైనెలూరుస్ వైవెర్రినస్ (prionailurus viverrinnus). మడ అడవులు, చిత్తడి నేలలలో ఎక్కువగా ఇవి జీవిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో మాత్రమే వీటి జాడను కనుగొన్నారు. 2013లో మడ అడవులపై రీసెర్చ్ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,500 నుంచి 2,000 వరకూ ఉండొచ్చని అంచనా. ఈ జాతులు ప్రత్యుత్పత్తి చెందకపోతే త్వరలోనే అంతరించిపోతాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి హెచ్చరించింది.
రాత్రివేళల్లోనే వేట..
78 సెం.మీ పొడవు, 8.8 కిలోల వరకూ బరువు పెరిగే ఈ బావురు పిల్లి రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. మన ఇళ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దవిగాను చిరుత పులికంటే చిన్నదిగానూ ఉంటుంది. అచ్చు చిరుత పులిని పోలి ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేస్తుంది. ఈ వాసన గమనించిన ఇతర జాతి పిల్లులు, జంతువులు ఆ పరిసరాలకు రావు.
పర్యావరణ పరిరక్షణకు దోహదం..
సముద్రంలో ఉండే పలు రకాల చేపలు పెట్టే గుడ్లు, కొన్ని రకాల చేపలను తినే పలు రకాల చేపలను ఈ బావురు పిల్లి తింటుంది. దీనివల్ల ఇది సంచరించే ప్రాంతంలో మత్స్య సంపద పెరగడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుంది.
తీర ప్రాంత ప్రజలకు అవగాహన
అంతరించిపోతున్న ఈ జాతిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏటా వణ్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ మధ్య బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అటవీ తీర గ్రామాల్లో అటవీశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అక్టోబర్‌లో లెక్కింపునకు చర్యలు..
అటవీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వీటి జాడను కనుగొన్నామని అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవరావు తెలిపారు. అక్టోబర్ నుంచి వీటి సంఖ్యను లెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment