కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణకు రూ. 40 వేల కోట్లు కావాలంటారు.. ఢిల్లీలో మాత్రం రూ.450 కోట్లు మాత్రమే అడుగుతారని, కేసీఆర్ ఇక్కడ పులిలా.. ఢిల్లీలో పిల్లిలా మారిపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో తెలంగాణ విభజన హామీలు, రైతులకు మద్ధతు ధర, నష్టపరిహారం తదితర విషయాలపై మాట్లాడి రావాలన్నారు. ప్రధాని మోదీని చూస్తే కేసీఆర్ భయపడిపోతున్నారని అన్నారు. కంది రైతులకు కర్ణాటక బోనస్ ఇస్తుంటే.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.
కందులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఎర్ర జొన్న రైతులు ఆందోళన చేస్తుంటే.. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌పై బురద జల్లడం మానుకోవాలని సూచించారు. గతంలో చెప్పిన బాబా రామ్ దేవ్ పసుపు ఫ్యాక్టరీ ఏమైందని సూటిగా ఎంపీ కవితను ప్రశ్నించారు. ఎస్టీ, మైనార్టీ బిల్లులను కేసీఆర్, ఢిల్లీకే పంపలేదని తమకు అనుమానం కల్గుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ ఎంపీలు రాష్ట్రం కోసం పోరాడుతుంటే టీఆర్‌ఎస్ ఎంపీలు మౌనంగా ఉండటం దారుణమన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు దద్దమ్మల్లా మారిపోయారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment